Irish woman swallowed 55 batteries
mictv telugu

ఆకలిగా లేదంటూ ఆస్పత్రికి మహిళ.. ఎక్స్‌రే తీసి షాకయిన వైద్యులు

September 16, 2022

ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆకలి లేకపోవడం, కడుపులో నొప్పితో సెయింట్ విన్సెంట్ ఆస్పత్రిలో చేరిన 66 ఏళ్ల మహిళ కడుపును స్కానింగ్ చేసిన వైద్యులు.. రిపోర్టు చూసి షాకయ్యారు. వెంటనే ఆపరేషన్ చేసి సమస్యను పరిష్కరించారు. ఐరిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆకలి మందగించడం, కడుపు నొప్పితో ఓ మహిళ ఆసుపత్రికి వెళ్లగా, డాక్టర్లు స్కానింగ్ చేసి రిపోర్టును విశ్లేషించారు. అందులో షాకింగ్ విషయం బయటపడింది. పొత్తి కడుపులో పదుల సంఖ్యలో బ్యాటరీలు ఉన్నాయని గుర్తించారు. వాటికి ఎలాంటి చిల్లులు పడకపోవడంతో సాంప్రదాయ పద్ధతిలో బయటకు రప్పించడానికి వారం పాటు ప్రయత్నించారు. అలా ఐదు బ్యాటరీలు బయటకు రాగా, మరికొన్ని ఆమె పొత్తి కడుపులో ఉండిపోయాయి. దీని వల్ల ఆమె పొత్తికడుపుకు వాపు రాగా, డాక్టర్లు ఆపరేషన్ చేశారు. మొత్తం 46 బ్యాటరీలను బయటకు తీశారు. ఈ క్రమంలోనే మరో నాలుగు బ్యాటరీలు పురీషనాళంలో చిక్కుకుపోయాయి. ఆనల్ రిట్రాక్టర్, లాంగ్ ఫోర్సెప్స్ పద్ధతుల్లో వాటిని కూడా తొలగించారు. ఇలా మొత్తం 55 బ్యాటరీలను తీశారు. ఇంకో వారంపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని, ప్రస్తుతం రోగి కోలుకుంటుందని డాక్టర్లు వెల్లడించారు. కాగా, స్వీయ హాని చేసుకునేందుకే మహిళ బ్యాటరీలను మింగిందని తెలుస్తోంది.