కరెంటోళ్ల లీలలు మామూలుగా ఉండవు. అవకతవక బిల్లులకు కరెంటోళ్ల తర్వాతే మరొకర్ని చెప్పుకోవాలి. రెండే రెండు గదులున్న రేకుల ఇంటికి తెలంగాణ విద్యుత్ అధికారులు ఏకంగా రూ. 88 వేల కరెంటు బిల్లు పంపారు. ఇల్లు అమ్మిపారేసినా అంత డబ్బు రాదని యజమాని గొల్లుమంటున్నాడు.
నల్గొండ జిల్లా చింతలపల్లిలోని నల్లవెల్లి నిరంజన్ ఇంటికి గత నెల 16 నుంచి ఈ నెల 5 వరకు రీడింగ్ తీయగా 8,793 యూనిట్లు వాడినట్లు తేల్చి రూ. 88,368 బిల్లు వేశారు విద్యుత్ సిబ్బంది. అతని ఇంట్లో రెండు బల్బులు, ఒక ఫ్యాన్ మాత్రమే వాడుతున్నారు. నల్లవెల్లి పుల్లయ్య అనే మరో వ్యక్తి ఇల్లు ఇరవై రోజుల్లో 8,672 యూనిట్లు వాడిందంటూ రూ. 87,338 బిల్లు వేశారు. బిల్లులు చూసి ఇంటి యజమానులు ఠారెత్తిపోతున్నారు. కనీస అవగాహన లేకుండా ఎలా వేస్తారని మండిపడుతున్నారు. సిబ్బంది నెల నెల రీడింగ్ తీయకపోవడం, బిల్లులు సరిగ్గా లెక్క వేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని వాపోతున్నారు.