పాలమూరు సాగు లెక్క తప్పింది - MicTv.in - Telugu News
mictv telugu

పాలమూరు సాగు లెక్క తప్పింది

August 24, 2017

ఆగస్టు 19 న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రొఫెసర్ హరగోపాల్  గారు “ తెలంగాణాకు ద్రోహం అంటే ..?” అన్న శీర్షికతో వ్యాసం రాసినారు. వ్యాసంలో కొన్ని పొంతన లేని విషయాలు , కొన్ని అవాస్తవాలు చోటు చేసుకున్నాయి. ప్రొఫెసర్ గారి మాటలకు , రాతలకు తెలంగాణా సమాజంలో విలువ , గౌరవం ఉన్నందున  పాఠకులు అవి నిజమని నమ్మే అవకాశం ఉన్న కారణంగా వాటిని సవరించడానికే ఈ వ్యాసం రాయవలసి వచ్చింది. దానికి తోడు ఈ మూడేండ్లలో  మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి క్రమాన్నివివరించాలని మా ప్రయత్నం. ప్రొఫెసర్ గారి పట్ల అపారమైన గౌరాభిమానాలతోనే ఈ ప్రయత్నం చేస్తున్నాము  తప్ప ఆయనను విమర్శించే సాహాసం చేయడం లేదు. జిల్లాలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల ప్రతిపాదనలు , సాంకేతికాంశాలు, నిధుల కేటాయింపులపై  సరి అయిన సమాచారం లేకుండా రాసిన వ్యాసంగానే భావించి వ్యాసంలో చోటు చేసుకున్న తప్పుడు విషయాలను సవరిస్తున్నామని వినమ్రంగా తెలియజేస్తున్నాము.

వ్యాసంలో తొలి పేరాలో ఆయన పేర్కొన్న అంశాల పట్ల మాకు భిన్నాభిప్రాయం ఏమీ లేదు కాబట్టి వాటి జోలికి పోవడంలేదు. ఇక రెండో పేరాలో పేర్కొన్న డిమాండ్ల విషయం విషయం చూద్దాం. ఈ డిమాండ్లు ఆగస్టు 14 న జరిగిన అఖిల పక్ష సమావేశంలో చర్చకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. చర్చలో ఏకాభిప్రాయం వెల్లడి అయ్యిందని కూడా పేర్కొన్నారు.

డిమాండ్ 1 : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండు భాగాలుగా విభజించి జూరాల ప్రాజెక్టు నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫేజ్ – 1గా, అలాగేకల్వకుర్తిఎత్తిపోతలపథకాన్నిశ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేపట్టి దానిని ఫేజ్-2 గా అమలు చేయాలి.

ఈ ఫేజ్-1, ఫేజ్-2 ఏమిటో సాగునీటి శాఖలో పని చేస్తున్న ఇంజనీర్లుగా  మాకైతే బోధపడలేదు. ఎందుకంటే ఫేజ్ -2 గా అమలు చెయ్యమన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం శ్రీశైలం జలాశయం నుంచే నిర్మాణం అవుతున్నది. దాదాపు పూర్తి కావస్తున్నది. గత సంవత్సరం ఈ ప్రాజెక్టు నుంచి 1.60 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించినాము. 220 చెరువులని నింపినాము. గతంలో ఎన్నడూ లేనంత పంట దిగుబడి వచ్చింది. ఇక ఫేజ్-1 పథకం ఏమిటో మదించి అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు నారాయణ్ పెట్ – కోడంగల్ ఎత్తిపోతల పథకం గురించి ఆయన ప్రస్తావించి ఉంటారని మాకు తోచింది. ఇదే విషయాన్ని ఆయన మరో చోట కూడా ప్రస్తావించినారు. నారాయణ్  పేట్ కోడంగల్ నియోజక వర్గాల్లోని 10 మండలాల్లో 40,470 హెక్టార్లకు (సుమారు ఒక లక్ష ఎకరాలకు) సాగునీరు అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాథమిక  సర్వే , ఇన్వేస్టిగేషన్ , డిజైన్ కోసం స్టేజ్ -1 అనుమతిని మంజూరు చేస్తూ జి ఒ 69 ని 23 .5.2014 న జారీ చేసింది. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు 9 రోజుల ముందు గవర్నరు పాలనలో  జారీ చేసిన జి ఒ . అప్పటికే ఎన్నికలు జరిగి కొత్త ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో జారీ చేసిందని ప్రజలు గమనించాలి. ఎదైనా పథకాన్నిరూపొందించడానికి నీటి లభ్యత మొదటి అవసరం. నారాయణ్ పేట్ కోడంగల్  సాగునీటి వసతి లేని దుర్బిక్ష ప్రాంతం కనుక నీరు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ ప్రాజెక్టుకు  నీటిని లభ్యత ఎక్కడి నుంచి , ఎట్లా చూపించినారో గమనిస్తే ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన పథకం  తప్ప నీరిచ్చే పథకం కాదని తెలిసిపోతుంది. రాజీవ్ భీమా ప్రాజెక్టుకు 20 టి ఎం సి కృష్ణా నికరజలాల కెటాయింపు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. 2.03 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు జలయజ్ఞంలో భాగంగా రాజీవ్ భీమా ప్రాజెక్టు అప్పటికే  ప్రారంభమయ్యింది. ఇప్పుడు దాదాపుపూర్తి అయ్యే దశలో ఉన్నది. ఒక టి ఎం సి కి 10 వేల ఎకరాలకు నీరు అందించే విధంగా భీమా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. 20 టి ఎం సి లు లకు 2.03 ఎకరాలకు సాగునీరు అందించడానికి  సరిపోతుంది. భీమా ప్రాజెక్టు డ్యూటీని ( ఒక టి ఎం సి సాగయ్యే భూమి ) ని 10000 ఎకరాల నుంచి 15000 ఎకరాలకు పెంచి 7.10 టి ఎం సి ల నీటిని సేవింగ్స్ కింద చూపించి నారాయణ్ పెట్ కోడంగల్ పథకానికి కేటాయించినారు. ఆ మేరకు   భీమా కెటాయింపులను తగ్గించినారు. 12.90 టి ఎం సి ల నీటితోనే భీమా కింద 2.03 లక్షల ఆయకట్టు అవసరాలను తీర్చవచ్చునని ప్రతిపాదించినారు. అట్లా భీమా ఆయకట్టు రైతులకు చెందవలసిన 7.10 టి ఎం సి ల నీటిని నారాయణ్ పేట్ – కోడంగల్ ఎత్తిపోతల పథకానికి కెటాయించినారు. భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణమైన భూత్పూర్ జలాశయం నుంచి నారాయన్ పేట్ –కోడంగల్ ఎత్తిపోతల పథకానికి నీటిని 4 దశల్లో ఎత్తిపోయడానికి ప్రతిపాదనలు తయారు చేసినారు. మొదటి దశలో 16193 ఎకరాలకు , రెండో దశలో 15875 ఎకరాలకు , మూడో దశలో 4236 ఎకరాలకు , నాలుగో దశలో 29451 , ఆ తర్వాత వాలు కాలువ ద్వారా 34,247 ఎకరాలకు సాగునీరు అందీంచేందుకు ప్రతిపాదించినారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రీ డిజైన్ లో భాగంగా గత ప్రభుత్వం ప్రతిపాదించినట్లు జూరాల నుండి కాక శ్రీశైలం జలాశయం నుంచే నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం నిపుణులతో విస్తృతంగా చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రకారం  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భారీ మార్పులు చోటు చేసుకునాయి. ఆయకట్టు 10 లక్షల ఎకరాలకు బదులు 12.30 లక్షల ఎకరాలకు పెరిగింది. రోజుకు 1.50 టి ఎం సి ల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోసి 6 ఆన్ లైన్ జలాశయాలు ( నార్లపూర్ , యేదుల , వట్టెం ,కరివెన, ఉద్దండాపూర్,లక్ష్మిదేవిపల్లి ) నిల్వ చేసుకోవాలని ప్రతిపాదించినారు. రోజుకు 1.50 టి ఎం సి నీటిని ఎత్తిపోసుకోవడానికి , 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి  జూరాల జలాశయంలో ఉండే  6 TMC ల నికరనిల్వ సరిపోదని భావించి 215 TMC ల నిల్వ సామర్థ్యం కలిగిన  భారీ జలాశయమైన శ్రీశైలంకు మార్చడం జరిగింది. ఈ మార్పుని తెలంగాణ ఇంజనీర్లు అందరూ స్వాగతించినారు. హర్షించినారు. మహబూబ్ నగర్ జిల్లాలో 7 లక్షలు , రంగారెడ్డి జిల్లాలో 5 లక్షలు , నల్లగొండ జిల్లాలో 30000 ఎకరాలకు సాగునీరు అందించడానికి పథకం రూపొందింది. టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించినారు. పాలమూరు రంగారెడ్డి పథకంలో పంపులు తిప్పితే జూరాల జలాశయం రెండు రోజుల్లో ఖాళీ అవుతుంది. ఇప్పటికే జూరాల ఆయకట్టుకు , భీమా , నెట్టెంపాడు , కోయిల్ సాగర్ ఆయకట్టుకు ఒకేసారి జూరాల జలాశయం నుంచి  నీరివ్వడానికి జలాశయం సామర్థ్యం దృష్ట్యా ప్రభుత్వం అనేక ఒత్తిళ్ళు ఎదుర్కోవలసి వస్తున్నది. నారాయణ్ పేట్ – కోడంగల్ ఎత్తిపోతల పథకంలో ప్రతిపాదించిన ఆయకట్టే కాక రెండింతల ఆయకట్టుకు నీరందించేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రతిపాదించడం జరిగింది. కరివెన జలాశయం నుండి సుమారు 1.30 లక్షలు, ఉద్దండాపూర్ జలాశయం నుండి సుమారు 70000 ఎకరాలకు , మొత్తం 2 లక్షల ఎకరాలకు ఈ రెండు నియోజక వర్గాల్లో సాగునీరు అందుతుంది. రెట్టింపు ఆయకట్టుకు సాగునీరు అందడంతో పాటు గ్రావిటీ ద్వారా నీరందే సౌకర్యం ఇప్పుడు ఏర్పడింది.

భీమా రైతులకు అందవలసిన నీటిని వారికి చెందకుండా , ఇటు ఇక్కడి అవసరాలకు సరిపోకుండా రూపొందించిన నారాయన్ పేట్ –కోడంగల్ ప్రాజెక్టు  ప్రతిపాదన అశాస్త్రీయమైనది. రెండు ప్రాజెక్టుల రైతాంగానికి అన్యాయం చేసే పథకం అది. గతంలో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని రూపొందించినప్పుడు ఒక టి ఎం సి కి 15000 ఎకరాలు ప్రతిపాదిస్తే అప్పటి ప్రభుత్వాన్ని ఇదేమి అన్యాయమని దుమ్మెత్తి పోసింది మనమే కదా. మరి ఇప్పుడు అటువంటి అశాస్త్రీయమైన ప్రతిపాదనని అమలు చెయ్యమని డిమాండ్ చెయ్యడం సమంజసమేనా ? భీమా ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతాంగానికి అన్యాయం చేసిన వాళ్లం కామా ? భీమా రైతాంగానికే కాదు నారాయన్ పేట్ కోడంగల్ రైతాంగానికి అన్యాయం చేసినట్లు కాదా? ఇప్పటికే జూరాలపై అధిక భారం ఉన్నది. ఈ స్థితిలో మరో ప్రాజెక్టు భారాన్ని మోపడం సమంజసమా? న్యాయాన్యాయాల స్పృహ మనకు ఉన్నదని , రేషనల్ ఆలోచనలు కలిగిన వాళ్ళం అని   భావిస్తున్నప్పుడు ఏదైనా డిమాండ్ ని ముందుకు తెచ్చేముందు భీమా రైతాంగానికి జరుగుతున్న అన్యాయం మన స్పృహలోకి ఎందుకు రావటం లేదు? భీమా 20 టిఎంసిల్లో అన్యాయంగా మిగులు చూపించి మరో ప్రాజెక్టును రూపకల్పన చేయడం , దాన్ని న్యాయాన్యాయాల భావన కలిగి ఉన్నవాళ్ళుగా సమర్థించడం, ఆ అశాస్త్రీయమైన ప్రాజెక్టునే అమలు చెయ్యమని డిమాండ్ చెయ్యడం ఒక వైరుధ్యం. అది ఎవరికీ న్యాయం చేసే డిమాండ్ కాదు. 20 టి ఎం సి ల వినియోగంతో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి పనులు దాదాపు పూర్తి కావచ్చినాయి. 2016-17 లో 1.40 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించినాము. ఈ నేపథ్యంలో నారాయణ్ పేట్–కోడంగల్ పథకాన్ని అమలు చెయ్యమని డిమాండ్ చెయ్యడం అంటే భీమా రైతాంగానికి , నారాయన్ పేట్ కోడంగల్ రైతాంగానికి మధ్య వైషమ్యాలు సృష్టించడమే.

డిమాండ్-2: పాలమూరు పథకంలో నార్లాపూర్ నుంచి డిండి పేరిట నల్గొండకు నీళ్ళు తరలించే బదులు నాగార్జునసాగర్ నుంచి నీళ్ళు అందించాలి.

ఈ డిమాండ్ వెనుక రాజకీయంగా ముందున్న నల్లగొండ వారు  మహబూబ్ నగర్ కు దక్కవలసిన నీటిని కొల్లగొట్టుక పోతారన్న భయం ఉన్నదనిపిస్తున్నది. డిండి నుంచి నల్లగొండకు నీటిని తరలించడం వలన పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తాము బలంగా  విశ్వసిస్తున్నామని ప్రొఫెసర్ గారు మరో చోట పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ , మునుగోడు , నాగార్జున సాగర్ , నల్లగొండ నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో  , మహబూబ్ నగర్ జిల్లాలో అచ్చంపేట్ , కల్వకుర్తి నియోజకవర్గాల్లోని 5 మండలాల్లో 3.41 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడానికి నక్కలగండి పథకాన్ని తొలుత  ప్రతిపాదించినారు. ఈ పథకానికి అవసరమయ్యే నీరు 30 టిఎంసిలు. అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై సమీక్ష జరుగుతున్న సమయంలోనే నక్కలగండి పథకం పై కూడా సమీక్ష జరిగింది. పాత నివేదికలోని ప్రతిపాదనలని కూలంకషంగా ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షించిన అనంతరం నక్కలగండి ఎత్తిపోతల పథకాన్ని రీ డిజైన్ చేయవలసి ఉన్నదని ప్రభుత్వం భావించింది. ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని ప్రభుత్వం ఇంజనీర్లని, సర్వే ఏజెన్సీని ఆదేశించింది. 5 ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడం జరిగింది. రీ డిజైన్ అనంతరం డిండీ ఎత్తిపోతల పథకంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పాలమూరు రంగారెడ్డి పథకం తో డిండీ పథకానికి కూడా ఒకే చోట నుండి శ్రీశైలం జలాశయం నుండే నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించినారు. కొత్త ప్రతిపాదనలు ఈవిధంగా ఉన్నాయి.  శ్రీశైలం జలాశయం నుంచి ఒకే ఇన్టేక్ వద్ద రోజుకు 2 TMC లను 60 రోజుల వరద కాలంలో మొత్తం 120 TMC లు ఎత్తిపోయడం జరుగుతుంది. అందులో పాలమూరు రంగారెడ్డి పథకానికి 90 TMC లు, డిండీ ఎత్తిపోతల పథకానికి 30 TMC సరఫరా చేయాలని ప్రభుత్వం భావించింది. నార్లాపూర్ జలాశయానికి ముందే 0.5 TMC ల నీరు క్రాస్ రెగ్యులేటర్ ద్వారా డిండీ కి మల్లించబడతాయి. మిగతా 1.5 TMC ల నీరు నార్లాపూర్ జలాశయానికి చేరతాయి. సాంకేతికంగా రెగ్యులేటర్ వద్ద డిండీకి మళ్ళించే నీరు 0.5 TMC లకు మించే అవకాశమే లేదు. కాబట్టి మహబూబ్ నగర్ కు  న్యాయంగా రావాల్సిన నీటిని నల్లగొండకు మల్లిస్తారన్నది అపోహ మాత్రమే. అయితే ఈ అపోహను మించిన సాంకేతిక అంశాన్నీ చర్చించాల్సిన అవసరం ఉన్నది. గతంలో పాలమూరు రంగారెడ్డి పథకంలో ఆయకట్టు 10 లక్షల ఎకరాలు ఉండేది. ఇప్పుడు అది 12.30 లక్షల ఎకరాలకు పెరిగింది. 90 TMC లతో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు , వందలాది గ్రామాలకు తాగునీరు ఎట్లా అందిస్తారన్నది అసలు ప్రశ్న. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నది. రోజుకు 2 TMC లకు బదులు రోజుకు  2.5 TMC లేదా 2.75 TMC లు  ఎత్తిపోయడం సాంకేతికంగా సాధ్యమా? ప్రాజెక్టుపై పడే అదనపు ఆర్థిక భారం ఎంత? వీటిపై అధ్యయనం జరుగుతున్నది. మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం చేసి , నల్లగొండ జిల్లాకు లాభం చేకూర్చే పని ప్రభుత్వం చేస్తుందని అనుకోవడం సరి అయిన దృక్పథం కాదు. రెండు జిల్లాలు 100 శాతం కృష్ణా బేసిన్లో ఉన్నవే. సాధ్యమైనంత మేరకు నల్లగొండ జిల్లాలోని ప్రాంతాలకు గోదావరి నీటిని అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పాత  నల్లగొండ జిల్లాలో ఉండే ఆలేరు , భువనగిరి నియోజక వర్గాల్లో 2.62 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. నార్లపూర్ నుంచి డిండీ ప్రాజెక్టుకు తరలించే మార్గంలో మహబూబ్ నగర్ జిల్లాలో మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందే విధంగా మార్పులు చేసే అధ్యయనం జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతున్నది అనేది  ఒక  ఆపోహ మాత్రమేనని మా భావన.

డిమాండ్-3: కల్వకుర్తి, భీమా,  నెట్టెంపాడులాంటి ఇతర పాలమూరు పథకాలన్నింటికి నీరందించడానికి నెట్టెంపాడు ద్వారా గట్టు హై లెవెల్ కాలువ చేపట్టాలి.

ఈ డిమాండ్ లో ఉన్న అర్థం పరమార్థం ఏమిటో ప్రొఫేసర్ గారికి సమాచారం అందించిన వారికి మాత్రమే అర్థం అవుతుంది. అర్థం పర్థం లేని ఈ  వాక్యాల మధ్య మాకు అర్థమైన సారాంశం ఏమిటంటే గట్టు హై లెవెల్ కాలువను కూడా చేపట్టాలి అని. ఈ డిమాండ్ ని ప్రభుత్వం నేరవేర్చే పనిలోనే ఉన్నది. జోగులాంబ గద్వాల జిల్లాలో గట్టు , ధరూర్, కె.టి దొడ్డి మండలాల్లో 28 వేల ఎకరాలకు సాగునీరు , సుమారు 40 చెరువుల కింద ఉన్న మరో 3 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగమైన రేలంపాడు జలాశయం నుంచి  ఎత్తిపోసే నీరు 2.8 TMC లు. ప్రభుత్వం ప్రాజెక్టు DPR తయారీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. DPR తయారీ కూడా చివరి దశలో ఉన్నది. త్వరలోనే ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తుంది.కాబట్టి ప్రొఫెసర్ గారు కోరినట్టు గట్టు ఎత్తిపోతల పథకం త్వరలోనే సాకారం కాబోతున్నది.

అలాగే RDS  ద్వారా తెలంగాణా సరిహద్దు దగ్గర 15.90 TMC ల నీరు కర్ణాటకతో చర్చించి ఓకే అంగీకారానికి రావాలి అన్నది ప్రొఫెసర్ గారి మరో నివేదన. RDS విషయంలో సాగునీటి మంత్రి హరీష్ రావు స్వయంగా బెంగుళూరు వెళ్లి కర్నాటక సాగునీటి మంత్రి పాటిల్ గారితో చర్చించినారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన RDS ఆదునీకీకరణ పనులని వేగవంతం చేయాలని కోరినారు. అందులోRDS ఆనకట్ట ఎత్తు 15 సెంటీ మీటర్లు పెంచడం , ఇతరత్రా ఆనకట్ట మరమ్మతులు , పూడిక తీత,  కాలువ లైనింగ్ పనులు మొదలైనవి ఉన్నాయి. కాలువ పనులు వేగవంతం అయినాయి. కాని ఆనకట్టు మరమ్మతుల పనులకు ఆంధ్రప్రదేశ్ మోకాలడ్డుతూనే ఉన్నది. కర్నాటక పనులు మొదలుపెట్టిన వెంటనే కర్నూలు రైతులు వేల సంఖ్యలో తరలి వచ్చి ఆనకట్ట వద్ద శాంతి భద్రతల సమస్యను ఉత్పన్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సహకారం లేకుండా తాము పనులని కొనసాగించలేమని కర్నాటక చేతులెత్తేసింది. ఆంద్ర సాగునీటి మంత్రి ఉమా మహేశ్వరరావుగారికి మంత్రి హరీష్ రావు  లేఖలు రాసినారు. ఫోన్ లో సంభాషించినారు. వారు చర్చలకు సుముఖంగా లేరు. వారి సహాయ నిరాకరణ కారణంగా  RDS ఆధునీకీకరణ పనులు అనుకున్నంత వేగంగా సాగుత లేవు. పంచాయతీ కర్ణాటకతో కాదు. ఆంధ్ర ప్రభుత్వంతో. ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి సహా అన్ని ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వానికి , కృష్ణా బోర్డుకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నది. ఆంధ్ర ప్రభుత్వ కుతంత్రాలపైన , సహాయ నిరాకరణపై తెలంగాణా మేధావులు , రాజకీయ పార్టీలు  ఎందుకు మాట్లాడరు? దీనికి విరుగుడుగా తెలంగాణా ప్రభుత్వం తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవలసి వచ్చింది. RDS కు కృష్ణా ట్రిబ్యునల్  అనుమతించిన 15.90 TMC ల నీటిని సంపూర్ణంగా వినియోగించటానికే తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం. దానికి ఎవరి అనుమతి అక్కర లేదు.

డిమాండ్-4: నిర్వాసితులకు ( శ్రీశైలం నిర్వాసితులతో సహా) భూమికి భూమి , ఇల్లు, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఇది ప్రభుత్వ పాలసీకి సంబందించిన అంశం. అయితే 2013 పునరావాస చట్టం , తెలంగాణ సవరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ప్రభుత్వం గతంలో కంటే మెరుగైన పరిహారం నిర్వాసితులకు ఇస్తున్నది.

డిమాండ్-5: కృష్ణా నదిలో కేటాయించిన నీళ్ళను రాష్ట్రంలో మళ్ళీ పున:పంపిణీ చేసి పాలమూరు , రంగారెడ్డి జిల్లాలకు సహజ నయా సూత్ర్రాల ప్రకారం నీళ్ళను కేటాయించాలి.

ఉమ్మడి రాష్ట్రంలో ఇదే డిమాండ్ ని మనం ప్రభుత్వం ముందు ఉంచినాము. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ గంపగుత్తగా (en bloc) కేటాయించిన 811 TMC ల నీటిలో తెలంగాణా ప్రాజెక్టులకు ఉమ్మడి ప్రభుత్వం  చేసిన కేటాయింపులు 299 TMC లు మాత్రమే. కృష్ణా బేసిన్ లో ఉండే తెలంగాణా ప్రాజెక్టులకు నికరజలాల  కేటాయింపులు పెరగాలంటే రాష్ట్రంలో జలాల పున: పంపిణీ జరగాలని ఆనాడు  మనం  భావించినాము. రాష్ట్రం విడిపోయిన తర్వాత 299 TMC ల నీటినే పున : పంపిణీ చెయ్యమనడం యాంత్రికమైన డిమాండ్. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన వెంటనే కృష్ణా జలాల పున:పంపిణీ నాలుగు రాష్ట్రాల మధ్య జరపాలని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. గత రెండు ట్రిబ్యునల్ల కేటాయింపుల్లో తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. సంవత్సరం లోపల కేంద్ర నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సుప్రీం కోర్టులో అంతర రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం నాలుగు రాష్ట్రాల మధ్య పున:పంపిణీ కోసం ట్రిబ్యునల్  ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని  పిటిషన్ దాఖలు చేసింది. ఆ కేసు విచారణ కొనసాగుతున్నది. ఈ లోపున కేంద్రం ఆంధ్రప్రదేశ్ పున్విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జాలాల పంపిణీ జరపాలని  బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు నివేదించింది. ట్రిబ్యునల్ లో కూడా విచారణ కొనసాగుతున్నది. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి సహజ న్యాయ  సూత్రాల ప్రకారం 450 నుంచి 500 TMC ల నీటిని పొందడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. అది సాకారం అయితే  పాలమూరు , రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయించుకోవడం సాధ్యపడుతుంది. ప్రొ.హరగోపాల్ గారి  లాంటి మేధావులు ఈ పోరాటంలో ప్రభుత్వానికి చేయూతనివ్వాలి.

ఇకపోతే ప్రొఫెసర్ గారు వ్యాసంలో ఒక చోట పాలమూరు జిల్లాకు కనీసం ఒక లక్ష ఎకరాల కన్నఎక్కువ సాగునీరు రాలేదు అన్నారు. ప్రొఫెసర్ గారి లెక్క తప్పిందని చెప్పడానికి సాహసిస్తున్నాము. అసలు లెక్క ఇది. జూరాల కింద ఒక లక్ష ఎకరాలు , జూరాల కాలువల పై రైతులు బిగించిన పంపు సెట్ల ద్వారా సాగు అవుతున్న భూమి సుమారు  30 వేలు , RDS కింద తక్కువలో తక్కువ 40 వేలు , కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద 4.5 లక్షల ఎకరాలు నికరంగా సాగు అయినాయి. ఈ నాలుగు ఎత్తిపోతల పథకాల కింద దాదాపు 500 చెరువులు నింపినాము. వారికింద 30 వేలు, మొత్తం 6.5 లక్షల ఎకరాలకు గత సంవత్సరం నికరంగా సాగునీరు అందించిన దాఖాలాలు ఉన్నాయి. కృష్ణా ప్రాజెక్టుల్లోకి నీరు వస్తే ఈ సంవత్సరం మరో 2.5 లక్షల ఎకరాలకు అంటే మొత్తం  9 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి కాలువలు సిద్దంగా ఉన్నాయి. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను అత్యంత ప్రాదాన్యతా క్రమంలో నిధులు కేటాయించి , అధికారులను, కాంట్రాక్టర్లను డ్రైవ్ చేసి  పూర్తి చేసినందువల్ల, మిషన్ కాకతీయలో చెరువులను బాగు చేసుకున్నదువల్ల సాధ్యమయ్యింది. వీటి ఫలితాలు జిల్లాలో గత సంవత్సరం పంట దిగుబడితో రైతుల అనుభవంలోనికి వచ్చింది. వలస పోయిన ప్రజలు ఊళ్లకు వాపసు వస్తున్నట్లుగా పత్రికలు కథనాలు రాసినాయి. చెరువుల్లో, కాలువల్లో నీరు రావడంతో జిల్లాలో ఒక స్పష్టమైన సామాజిక, ఆర్ధిక మార్పు కనబడుతున్నది. తెలంగాణ ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి కష్టాలని తొలగించడానికి కృత  నిశ్చయంతో ఉన్నది. అందులో భాగంగా గత ప్రభుత్వం ప్రారంభించిన పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేసి , గత ప్రభుత్వం  ఆమోదించి అటకెక్కించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మూడెండ్లలో ప్రాజెక్టును పూర్తి చెయ్యాలని సంకల్పించింది. అందుకు నిధుల కొరత లేకుండా చూస్తున్నది. ప్రాజెక్టును అడ్డుకునే బయటి మరియు అంతర్గత శత్రువుల కుటిల పన్నాగాలని తిప్పికొట్టి  మహబూబ్ నగర్ జిల్లా ప్రజల సాగునీటి ఆకాంక్షలని నెరవేర్చే కృషిలో ముందుకు సాగుతున్నది. మూడు నాలుగు సంవత్సారాల్లో పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి , కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ , జూరాల, ఆర్డీఎస్, తుమ్మిళ్ళ,  గట్టు, చిన్న నీటి చెరువుల కింద మొత్తం 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇది తెలంగాణలో ఏ జిల్లాతో పోల్చి చూసినా అత్యధికం అనడానికి సందేహించనక్కరలేదు.

****

శ్రీధర్ రావు దేశ్ పాండే , కో చైర్మన్ , తెలంగాణా ఇంజనీర్స్ జె ఎ సి

 సల్లావిజయ్  కుమార్ , సెక్రెటరీ, తెలంగాణా ఇంజనీర్స్ జె ఎ సి