మాస్క్ పెట్టుకోని కేసీఆర్‌కు జరిమానా వెయ్యరా?: ఉత్తమ్ - MicTv.in - Telugu News
mictv telugu

మాస్క్ పెట్టుకోని కేసీఆర్‌కు జరిమానా వెయ్యరా?: ఉత్తమ్

May 30, 2020

Uttam Kumar.

కరోనా మహమ్మారి రోజురోజుకు తన విశ్వరూపం చూపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇలాంటి సమయంలో ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లలో తక్కువమంది పాల్గొనాలని, మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి అని చెబుతున్నాయి. అయితే ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలే తప్పు చేస్తే ఎలా అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మాస్కు పెట్టుకోని కేసీఆర్‌కు జరిమానా వెయ్యరా? అని అంటున్నారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను ఎత్తిపోతలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, చిన్నజీయర్ స్వామి, మంత్రులు, అధికారులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

ఇందుకు సంబంధించిన ఫోటోను ఉత్తమ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. కేసీఆర్, మంత్రులు వందలాది మంది మధ్య ఉండి కూడా ముఖాలకు మాస్కులు ధరించలేదని, కనీసం భౌతికదూరం పాటించలేదని ధ్వ‌జమెత్తారు. ‘స్వయంగా సీఎం కేసీఆరే కరోనా లాక్‌డౌన్ నిబంధనలు రూపొందించారు. పెళ్లికి 20 మంది మించకూడదని, అంత్యక్రియల్లో 10 మంది కంటే ఎక్కువమంది పాల్గొనరాదని అన్నారు. మాస్కులు ధరించకపోతే రూ.1000 జరిమానా విధిస్తాం అన్నారు. నియమనిబంధనలు సామాన్యులకేనా.. కేసీఆర్ ఏమైనా చట్టానికి అతీతుడా?’ అంటూ ఉత్తమ్ ప్రశ్నించారు.