సంక్షోభం దిశగా నేపాల్.. భారత్ చుట్టూ ఏంటీ పరిస్థితి? - MicTv.in - Telugu News
mictv telugu

సంక్షోభం దిశగా నేపాల్.. భారత్ చుట్టూ ఏంటీ పరిస్థితి?

April 12, 2022

vcb

శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం వల్ల విదేశీ రుణాలను చెల్లించలేని పరిస్థితులకు వెళ్లిపోయింది. ఇప్పుడు అదే రూటులో నేపాల్ రాబోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్నుంచీ భారత్‌ను పెద్దన్నగా భావించిన దేశాలు ఆ తర్వాత చైనా చెంతన చేరి ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేశాయి. అవికాస్తా తెల్ల ఏనుగుల్లా మారిపోవడంతో చైనా బాధిత దేశాలుగా మారిపోతున్నాయి. ఈ వరుసలో నేపాల్‌తో పాటు పాకిస్తాన్ కూడా త్వరలో చేరనుంది. నేపాల్‌లో విదేశీ మారక ద్రవ్యం క్రమేపీ తగ్గుతూ వస్తుంది. గతేడాది జులై నాటికి 11.75 బిలియన్ డాలర్లుగా ఉన్న నిల్వ నిధులు ప్రస్తుత ఏడాది ఫిబ్రవరి వరకు 9.75 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ నిధులు ఏడు నెలల వరకు సరిపోతాయి. ఇందుకు బాధ్యుడిగా ఆ దేశ సెంట్రల్ బ్యాంకు గవర్నరుపై నేపాల్ చర్యలు తీసుకుంది. ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడేయలేదనే కారణంతో ఇంకా మూడేళ్ల పదవీ కాలం ఉన్నా ఆయనను తొలగించారు. నేపాల్ చరిత్రలో ఇలా సెంట్రల్ బ్యాంకు గవర్నరును తొలగించడం ఇది రెండోసారి. ఇదిలా ఉండగా, సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి నేపాల్ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు ప్రారంభించింది.

విదేశీ విలాస వస్తువులు, వాహనాల దిగుమతులపై నిషేధం విధించింది. మున్ముందు చమురు సహా ఇతర నిత్యావసర వస్తువుల దిగుమతికి అవసరమవుతాయంటూ డాలర్లను పొదుపుగా వాడుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీలంక వంటి పరిస్థితులు నేపాల్‌లో రావని ఆర్ధిక మంత్రి జనార్ధన్ శర్మ అంటున్నారు. విదేశీ రుణ భారం తక్కువగా ఉండడం, రెవెన్యూ వసూళ్లు సంతృప్తికరంగా ఉండడం వల్ల ఇబ్బంది ఉండదనేది ఆయన వాదన. మరోవైపు పాకిస్తాన్ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఎఫ్ఏటీఎఫ్ నిబంధనలతో దాదాపు బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చినా దరిద్రంలో మాత్రం ఎలాంటి మార్పు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాగా, చైనా చాలా తెలివిగా భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలను అప్పు పేరుతో తన ఉచ్చులోకి లాగిందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా ఆయా దేశాలను తమ చెప్పుచేతల్లో ఉంచుకొని, తదుపరి భారత్‌ను చికాకు కలిగించాలని చైనా పన్నాగమని అభిప్రాయపడుతున్నారు.