జార్జిరెడ్డిలో ఓయూ క్యాంపస్ నిజమేనా? అందరి నోటా ఇదేమాట  - MicTv.in - Telugu News
mictv telugu

జార్జిరెడ్డిలో ఓయూ క్యాంపస్ నిజమేనా? అందరి నోటా ఇదేమాట 

November 23, 2019

‘మాకు తెలియకుండా మా యూనివర్సిటీలో జార్జిరెడ్డి సినిమా ఎప్పుడు తీశారు’ ఇది కొంతమంది ఉస్మానియా విద్యార్థులు అంటున్న మాట. ఈ మాట ఒక్కటి చాలు ‘జార్జిరెడ్డి’ సినిమాలోని ఉస్మానియా యూనివర్సిటీ సెట్ గురించి చెప్పడానికి. ఇది వారి మాటే కాదు సినిమా చూసిన రెండు రాష్ట్రాల ప్రేక్షుకులు అంటున్న మాట. ఓయూ క్యాంపస్‌లో సినిమాను భలే తీశారే అంటున్నారు. అయితే అది నిజమైన ఓయూ కాదు. సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ మాత్రమే అని చెప్పినా నమ్మలేము అంటున్నారు.

ఆ సెట్ నిజం అని అందరూ భ్రమపడటానికి కారణం అది సెట్‌లా కాకుండా.. నిజమైన రాతి కట్టడంలా అనిపించడమే. సినిమా సాంతం ఓయూ క్యాంపస్, హాస్టల్, ఇల్లు చుట్టే తిరుగుతుంది. ఇలా మనల్ని సినిమా 60-70 దశకాల్లోకి తీసుకువెళుతుంది. సినిమాకు ఓయూ సెట్టే జీవం పోసిందని అని చెప్పాలి. ఆ సెట్‌లో దర్శకుడు జీవన్ రెడ్డి ప్రతీ సన్నివేశాన్ని ఉలితో చెక్కినట్టే చెక్కారు. 

తెరమీద అంత పర్‌ఫెక్టుగా సెట్ వేసిన కళా దర్శకుడు గాంధీ నదికుడికారు పనితనం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆయన ఈ సెట్ కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి బాగా పరిశోధన చేశారు. దాని చరిత్ర, ఎప్పుడు, ఎలా కట్టారు అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. రాతి కట్టడమైన ఓయూకు జిరాక్స్ కాపీ దింపాలంటే అంత తేలికైతే కాదు. అలా ఆయన సెట్ నిర్మాణంలో చాలా గ్రౌండ్ వర్క్ చేశారు.

ముందు స్కెచ్ వేసుకుని ఆ తర్వాత సెట్ వేశారు. మెదక్ జిల్లాలోని చర్చి ఆవరణలోని వెస్లీ కళాశాల ఆవరణలో సెట్ వేశారు. జార్జిరెడ్డి సినిమా విడుదల అయి విజయవంతంగా దూసుకుపోయి అందరూ తను వేసిన ఓయూ సెట్ గురించి మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు గాంధీ. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను చూసి  తను పడ్డ కష్టానికి మంచి ఫలితం వచ్చిందని అంటున్నారు.