భారత్కు భారీ భూకంప ముప్పు ఉందా.? టర్కీ, సిరియా తరహాలో భూకంపం వచ్చే ప్రమాదం ఉందా. అంటే అవుననే సమాధానం చెబుతున్నారు ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్. యూపీలోని ఐఐటీ కాన్పూర్ ఎర్త్ సైన్స్ విభాగానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జావేద్ మాలిక్ తెలిపిన వివరాల ప్రకారం..టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం మాదిరిగానే భారత్ లో కూడా బలమైన భూప్రకంపనలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రొఫెసర్ జావేద్ మాలిక్..చాలా ఏళ్లుగా భారత్ లో సంభవించిన భూకంపాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో 7.5తీవ్రతతో భూకంపాలు సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. రానున్న ఒకటి, రెండు దశాబ్దాల్లో లేదా ఒకటి రెండేళ్లలో ఎప్పుడైనా భారీ భూకంపం సంభవించే ఛాన్స్ ఉందంటున్నారు. హిమాలయ మాసిఫ్ లేదా అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంప కేంద్రం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టర్కీ, సిరియా వలే వచ్చే భూకంపం దృష్ట్యా, ప్రతి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రొఫెసర్ సూచించారు.
భూకంప ప్రభావిత ప్రాంతాలైన కచ్, అండమాన్, ఉత్తరాఖండ్ లో చాలా కాలంగా భూమి మార్పులను అధ్యయనం చేస్తున్నారు మాలిక్. భూప్రకంపనల దృష్ట్యా భారత్ లో ఐదు జోన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ 5 జోన్లలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలు అండమాన్ నికోబార్, హిమాలయ ప్రాంతాలు ఉండగా…జోన్ 4లో బహ్రైచ్,లఖింపూర్, పిలిభిత్, రూర్కీ, ఘిజియాబాద్, టెరాయ్, నైనినటాల్ ప్రాంతాలు ఉన్నాయి. జోన్ 3లో లక్నో, కాన్పూర్, వారణాసి, సోన్ భద్ర, ప్రయాగ్ రాజ్ ప్రాంతాలు ఉన్నాయి. కాగా టర్కీలో 7.8తీవ్రతో భూకంపం సంభవించగా…2004లో బారత్ లో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.