భారత్‌కు మాల్యా.. ఈ రాత్రికే లండన్ నుంచి ముంబై జైలుకు! - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌కు మాల్యా.. ఈ రాత్రికే లండన్ నుంచి ముంబై జైలుకు!

June 3, 2020

 

Mallya

బ్యాంకుల దొంగ, లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా ఛేజింగ్ కథకు శుభంకార్డు పడింది. లండన్‌ కోర్టుల్లో ఎదురుదెబ్బ తిన్న మాల్యాను అక్కడి ప్రభుత్వం భారత్‌కు అప్పగించనుంది. ఈ మేరకు మాల్యా అప్పగింతకు సంబంధించిన న్యాయ ప్రక్రియ మొత్తం పూర్తయింది. బ్రిటన్ హోంమంత్రి కూడా సంతకం చేసినట్లు సమాచారం. ఇవాళ రాత్రికే లండన్ నుంచి ముంబైకి తరలిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముంబై ఎయిర్‌పోర్టు నుంచి మాల్యాను నేరుగా ఆర్ధర్ రోడ్డులోని సెంట్రల్‌కు తరలిస్తారు. సీబీఐ అధికారులు అక్కడ ఆయన్ను ప్రశ్నించనున్నారు. అనంతరం గురువారం మాల్యాను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో మాల్యాను కస్టడీకి అప్పగించాలని సీఐడీ, ఈడీ కోర్టును కోరే అవకాశం ఉంది. అయితే మాల్యా అప్పగింతకు సంబంధించి కేంద్రం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా, మాల్యా పలు బ్యాంకులకు రూ.9వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టినట్లు ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. దీంతో అప్పులు, ఆర్థిక కష్టాల్లో కింగ్ ఎయిర్‌లైన్స్ మూతపడిన సంగతి తెలిసిందే. అనంతరం విజయ్ మాల్యా 2016 మార్చిలో భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయారు. అయితే మాల్యాను భారత్‌కు అప్పగించాలంటూ వెస్ట్‌ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను బ్రిటన్ హోంమంత్రి ఆమోదించారు. 

మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ మాల్యా హైకోర్టును ఆశ్రయించారు. అనూహ్యంగా  ఆయన అప్పీలును కొట్టివేస్తూ ఏప్రిల్ 20న హైకోర్టు తీర్పు ఇచ్చింది. అక్కడినుంచి మాల్యా  సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అక్కడా చుక్కెదురైంది. మే 14న విజయ్ మాల్యా వేసిన పిటిషన్‌ను యూకే సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో బ్రిటన్‌లో మాల్యాకు అన్ని దారులూ మూసుకుపోయాయి. తప్పించుకుందామనుకుంటున్న మార్గాలన్నీ మూసుకుపోవడంతో ఆయన భారత్ రాక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.