ముంబైలోని వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. హార్దిక్ పాండ్య కెప్టెన్ షిప్లో యువ ఆటగాళ్లతో సరికొత్తగా మారిన టీ20 జట్టు.. శ్రీలంకను 160 పరుగులకు ఆలౌట్ చేసింది. దీపక్ హూడా, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ బ్యాట్‌తో రాణించగా.. యువ బౌలర్లు శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ బంతితో నిప్పులు చెరిగారు. కీపర్ ఇషాన్ కిషన్ కూడా వికెట్ల వెనుక చురుగ్గా కదిలి అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆరంగేట్రంలోనే భారత బౌలర్ శివమ్ మావి అదరగొట్టాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే నాలుగు వికెట్లను పడగొట్టాడు. అలాగే ఉమ్రాన్, అక్షర్ పటేల్‌లు రెండేసి వికెట్లు తీశారు.
శ్రీలంక జట్టు కూడా పోటాపోటీగా తన ప్రతిభ కనబర్చింది. బౌలింగ్‌తో భారత్‌ను గట్టి దెబ్బ తీసిన లంక.. ఆ తర్వాత బ్యాటింగ్‌తోనూ కంగారెత్తించింది. అలాగే శ్రీలంక బ్యాటింగ్ విషయానికొస్తే.. శనాక 45 పరుగులు, మెండిస్ 28, కరుణరత్నే 23 పరుగులు తీశారు. 162 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను చివరకు 160 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బంతిని అక్షర్ పటేల్ చేతికి ఇచ్చాడు. అతడు ఈ ఓవర్లో 10 పరుగులు ఇచ్చి రెండు రనౌట్లు చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. దీంతో రెండు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Incredible Ishan: Relive that sensational catch 👇👇
Watch – https://t.co/FKH2aJevxl #INDvSL @mastercardindia
— BCCI (@BCCI) January 3, 2023
ఈ మ్యాచ్ లోని శ్రీలంక బ్యాటింగ్ లో ఉమ్రాన్ వేసిన బంతిని చరిత్ అసలంక భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. కీపర్ ఇషాన్ కిషన్ చిరుతలా పరుగెత్తి, గాలిలోకి డైవ్ చేస్తూ అద్భుతంగా బంతిని అందుకున్నాడు. దీంతో అసలంక 12 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. కిషన్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అద్భుతమైన క్యాచ్‌ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇటీవలి కాలంలో వికెట్ కీపర్ పట్టిన అత్యుత్తమ క్యాచ్ ఇదని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. అలాగే ధోనిని గుర్తుచేశావంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.