బగ్దాదీని పట్టించాడు.. రూ.177 కోట్లు కొట్టేశాడు! - MicTv.in - Telugu News
mictv telugu

బగ్దాదీని పట్టించాడు.. రూ.177 కోట్లు కొట్టేశాడు!

October 30, 2019

ISIS ..

ఐసిస్ చీఫ్‌ అల్ బకర్ బాగ్దాదీని అమెరికా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెల్సిందే. బాగ్దాదీ జాడను కనిపెట్టిన అమెరికా సైన్యం.. పక్కా పథకంతో అతడిని అష్టదిగ్భందనం చేసి ఆత్మాహుతికి పాల్పడేలా చేసింది. అమెరికా దళాలు వెంబడించడంతో బాగ్దాదీ తనతో పాటు తన ముగ్గురు పిల్లలను కూడా బాంబులతో పేల్చివేశాడు. బాగ్దాదీ చేతిలో హత్యకు గురైన అమెరికా సామాజిక వేత్త కైలా ముల్లర్ పేరుతో ఈ రహస్య ఆపరేషన్‌‌ను అమెరికా బలగాలు చేపట్టాయి.

కాగా..ఈ రహస్య ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించ ఇన్ఫార్మర్‌కు భారీ నజరానా అందనుందని అమెరికా మీడియా పేర్కొంది. బాగ్దాదీ తలపై అమెరికా ప్రభుత్వం పెట్టిన రూ.177కోట్ల రివార్డు ఆ ఇన్ఫార్మర్ సొంతం కాబోతుందని సమాచారం. ఇన్ఫార్మర్ కూడా ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన ఓ వ్యక్తికే కావడం గమనార్హం. ఇన్ఫార్మర్ బాగ్దాదీ గురించి స్పష్టమైన సమాచారమిచ్చి అమెరికా ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. బాగ్దాదీ ఉన్న స్థావరానికి అమెరికా బలగాలను తీసుకెళ్లేందుకు సిరియా.. ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన ఓ వ్యక్తిని ఇన్ఫార్మర్‌గా పెట్టుకుంది. ఆ ఇన్ఫార్మర్‌ కొంత కాలంగా సిరియాలోని ఇద్లిబ్‌లో ఉంటూ బాగ్దాదీ స్థావరం గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాడు. బాగ్దాదీ దాక్కొన్న కచ్చితమైన ప్రదేశం, ఆ ఇంటి లేఅవుట్‌, అక్షాంశ, రేఖాంశ వివరాలతో పాటు ఎన్ని గదులున్నాయి? ఎంతమంది కాపలా కాస్తున్నారు? సొరంగం మార్గం తదితర వివరాలను అమెరికా దళాలకు అందించాడు. ఆపరేషన్‌కు చాలా రోజుల ముందు ఆ వ్యక్తి.. బాగ్దాదీ ఉపయోగించిన లోదుస్తులు, రక్తనమూనాలను అమెరికా నిఘా అధికారులకు అందించినట్లు సమాచారం. ఆ నమూనాల ఆధారంగానే డీఎన్‌ఏ పరీక్షను నిర్వహించి బాగ్దాదీ మరణాన్ని అమెరికా ధ్రువీకరించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ వ్యక్తి వివరాలను అధికారులు వెల్లడించడంలేదు.