ఇస్లాం, భారత దేశం గురించి జమియత్ ఉలామియా ఐ హింద్ సంస్థ అధ్యక్షుడు మౌలానా మహ్మూద్ మదానీ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇస్లాం బయటి నుంచి వచ్చిందనేది తప్పు. నిరాధారమైనది. భారతదేశంలో ఇస్లాం పురాతనమైన మతం. ఈ దేశం ముస్లింలకు మాతృభూమి. అన్ని మతాల్లోకెల్లా ఇస్లామే ప్రాచీనమైనది. హిందీ ముస్లింలకు భారత్ అత్యుత్తమ దేశం’ అంటూ కొత్త భాష్యం చెప్పారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన సంస్థ ప్లీనరీ సదస్సు ప్రారంభం సందర్భంగా మదానీ ఈ వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు ఈ దేశం ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్‌లకు ఎంత చెందుతుందో.. తనకు కూడా అంతే చెందుతుందన్నారు. మోదీ కంటే మదానీ తక్కువ కాదు.. మదానీ కంటే మోదీ ఎక్కువ కాదన్నారు. ఒక్క అంగుళం ఎక్కువ తక్కువ కాదని అందరూ సమానమేనని అభిప్రాయపడ్డారు. అలాగే బలవంతపు మత మార్పిడులను వ్యతిరేకించారు. మోసం, ప్రలోభాలతో మతం మార్చవద్దని, మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అని వెల్లడించారు. కానీ స్వచ్ఛందంగా మతం మారితే.. వారిని తప్పుడు అభియోగాలతో జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. కొన్ని కేంద్ర ఏజెన్సీలు ముస్లింలను టార్గెట్ చేశాయనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయంటూ.. నమాజ్‌పై నిషేధం, పోలీసుల చర్యలు, బుల్డోజర్ యాక్షన్ వంటివి ఆ కోవలోకే వస్తాయని పేర్కొన్నారు. ‘ఇస్లామోఫోబియా పెరిగిపోతోంది. మైనార్టీలపై హింసకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేలా ప్రత్యేక చట్టం తేవాలి. ఆర్ఎస్ఎస్‌కు మేం వ్యతిరేకం కాదు. అయితే సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నాయి. హిందుత్వానికి సంబంధించి తప్పుడు వెర్షన్ వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం ఉన్న హిందూత్వం భారతీయ స్పూర్తికి వ్యతిరేకం’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో పాటు ముస్లింలలో వెనకబడిన వర్గాలపై స్పందించారు. ‘పాష్మాండ ముస్లింలు వివక్షకు గురయ్యారు. వారి అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి బాగుంది. వారికి రిజర్వేషన్ల కోసం మేం పోరాడుతాం. ముస్లింలంతా సమానమే. ఇస్లాంలో కుల వివక్షకు తావు లేద’న్నారు. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన తుర్కియేకి భారత్ అందిస్తున్న సాయం పట్ల ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.