టిక్‌టాక్‌లో ఐసిస్ వీడియోలు.. తొలగిస్తున్న యాజమాన్యం..  - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్‌లో ఐసిస్ వీడియోలు.. తొలగిస్తున్న యాజమాన్యం.. 

October 24, 2019

Islamic State’s TikTok Posts Include Beheading Videos.

ఇప్పటికే యువతను టిక్‌టాక్ యాప్ పెడదారి పట్టిస్తోందని కన్నవాళ్లు నెత్తీనోరు బాదుకుంటున్నారు. టిక్‌టాక్‌లో అశ్లీలత బాగా పెరిగిపోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను సుప్రీంకోర్టు బ్యాన్ చేసినట్టే చేసి మళ్లీ బ్యాన్‌ను ఎత్తివేసింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ యాప్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అశ్లీలత చాలదన్నట్టు ఇప్పుడు టిక్‌టాక్‌లో నేరాలను వ్యాప్తి చేయడానికి ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ అఫ్ ఇరాక్ అండ్ సిరియా) కంకణం కట్టుకున్నంత పనే చేస్తోంది. వారు టిక్‌టాక్‌లోకి ప్రవేశించారని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా సైట్లలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు తాజాగా టిక్‌టాక్‌ను వేదికగా చేసుకున్నట్టు సమాచారం.

150 నుంచి 1000 మంది వరకు ఫాలోవర్స్ ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు టిక్‌టాక్ యాప్ ద్వారా హింసాత్మక వీడియోలను షేర్ చేస్తున్నారు. తమవద్ద బందీలుగా ఉన్నవారిని అతి కిరాతకంగా హింసిస్తూ గొంతు కోసి చంపేస్తున్న వీడియోలను వారు షేర్ చేస్తున్నారు. దీనిని గమనించిన టిక్‌టాక్ యాజమాన్యం షాక్ అయింది. వెంటనే వాటిని డిలీట్ చేస్తూ వచ్చింది. వారికి మరొక షాకింగ్ ఏంటంటే.. ఆ వీడియోలను కొంతమంది లైక్ చేయడమే కాదు వారిని ఫాలో అయ్యే యూజర్ల సంఖ్య పెరగడం. గత మూడు వారాలుగా ఐసిస్ టిక్‌టాక్‌లో వీడియోలను పోస్టు చేస్తోందని యాజమాన్యం భావిస్తోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు సంబందించిన ఖాతాలను తొలగిస్తున్నట్టుగా టిక్‌టాక్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రజలు కూడా వీటికి దూరంగా ఉండాలని కోరింది. అయితే ఈ వీడియోలను పోస్ట్ చేస్తున్నవారిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం. టిక్‌టాక్‌లో దాదాపు అందరూ 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు వారే ఉన్నారు. వారిపై ఐసిస్ ప్రభావం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని టిక్‌టాక్ యాజమాన్యం వాపోయింది.