మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరోసారి ప్రయోగానికి సిద్ధమైంది. నావిగేషన్ శాటిలైట్ ఎన్‌వీఎస్-1ను నింగిలోనికి పంపనుంది. సోమవారం ఉదయం 10గంటల 42నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 ప్రయోగం చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ఆదివారం ఉదయం 7గంటల 12నిమిషాలకు ప్రారంభమైంది. 27గంటల 30 నిమిషాల పాటు ఈ కౌంట్‌డౌన్ అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఇస్రో నావిగేషన్ సేవల కోసం గతంలో పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాల్లో నాలుగింటికి జీవితకాలం ముగిసింది. వాటి స్థానంలోనే ఈ ఎన్‌వీఎస్ ఉపగ్రహ ప్రయోగం చేపడుతున్నారు. ప్రతి ఆరునెలలకు ఒక ఉపగ్రహాన్ని పంపేలా సన్నాహాలు చేస్తున్నారు. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ (NavIC) ఇస్రో అభివృద్ధి చేసిన ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది కక్ష్యలో ఉన్న ఏడు ఉపగ్రహాల సమూహం కాగా.. ఇది గ్రౌండ్ స్టేషన్‌లతో కలిసి పని చేస్తుంది. నెట్‌వర్క్ సాధారణ వినియోగదారులు, వ్యూహాత్మక వినియోగదారులకు నావిగేషనల్ సేవలను కూడా ఈ శాటిలైట్ అందిస్తుంది. సాయుధ దళాలు, మెరుగైన పొజిషనింగ్, నావిగేషన్ అండ్ టైమింగ్ కోసం దేశంలో పౌర విమానయాన రంగానికి పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని ఇస్రో తీర్చిదిద్దింది. ఇది లెగసీ NavIC సేవల కొనసాగింపును నిర్ధారిస్తుందని, Li బ్యాండ్‌లో కొత్త సేవలను అందించనున్నట్టు ఇస్రో అధికారులు వెల్లడించారు.