Isro rocket launch successful
mictv telugu

ఎం-3-ఎం-3 రాకెట్ ప్రయోగం విజయవంతం

March 26, 2023

 Isro rocket launch successful

శ్రీహరికోట లోని షార్ నుంచి ఈరోజు ప్రయోగించిన ఎల్వీఎం-3-ఎం-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నిర్దిష్ట కక్ష్యలోకి 36 ఉపగ్రహాలు చేరుకున్నాయి. యూకే తో భారత్ కుదుర్చుకున్న ఒప్పంద ప్రయోగాలలో రెండో ప్రయోగం ఘనవిజయం సాధించింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో వాణిజ్య ప్రయోగాలకు డిమాండ్ పెరుగనుంది.

ఎల్వీఎం-3-ఎం-3 రాకెట్ ప్రయోగం ఊహించిన విజయం సాధించిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథన్ అన్నారు. కక్ష్యలోకి చేరుకున్న 16 ఉపగ్రహాల నుంచి భూమికి సంకేతాలు అందాయన్నారు. ఎల్వీఎం-3-ఎం-3 రాకెట్ ప్రయోగ విజయం ఇస్రోకు గర్వకారణమని, ఈ విజయం చారిత్రాత్మక విజయంగా భావించాలని అన్నారు. ఎల్వీఎం-3-ఎం-3 ప్రయోగ విజయం భవిష్యత్తు ప్రయోగాలకు ప్రాణం పోసిందని, షార్ నుంచి పీఎస్ఎల్వీ ద్వారా మరో వాణిజ్య ప్రయోగం త్వరలోనే ఉంటుందని సోమనాథ్ స్పష్టం చేశారు.

షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ ఉదయం 9 గంటలకు ఎల్వీఎం-3-ఎం-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది. నిన్న ఉదయం 8.30 గంటల నుంచి కౌంట్ డౌన్ మొదలైంది. భూమి ఉపరితలం నుంచి 450 కి.మీ దూరంలోని లియో ఆర్బిటల్ వృత్తాకార కక్ష్యలోకి 36 ఉపగ్రహాలను ప్రవేశపెట్టేలా డిజైన్ చేశారు. 20 నిమిషాలపాటు నింగిలో ప్రయాణించిన అనంతరం 36 ఉపగ్రహాలను ఒకదాని వెంట ఒకటి కక్ష్యలోకి రాకెట్ ప్రవేశపెట్టింది. ఎల్వీఎం-3-ఎం-3 రాకేట్ ఎత్తు 43.5 మీటర్లు. బరువు 643 టన్నులు. 36 ఉపగ్రహాల బరువు 5,805 కిలోలు. రాకెట్ ప్రయోగం నేపథ్యంలో షార్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు.