ISRO SENDING PRIVATE ROCKETS IN TO THE SKY
mictv telugu

ప్రైవేట్ సంస్థ రాకెట్ ను ప్రయోగించనున్న ఇస్రో

November 18, 2022

ISRO SENDING PRIVATE ROCKETS IN TO THE SKY

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో అడుగు ముందుకు వేసింది. తొలిసారి మన దేశంలోనే ప్రైవేట్‌ సంస్థ రూపొందించిన రాకెట్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) నింగిలోకి పంపుతోంది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ (Skyroot Aerospace) రూపొందించిన విక్రమ్-ఎస్ రాకెట్‌ను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పంపుతోంది. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు దీనిని ప్రయోగించనున్నారు. 6 మీటర్ల పొడవు, 545 కిలోల బరువున్న ఈ రాకెట్‌.. ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరిన తర్వాత 81.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణిస్తుంది. తర్వాత శ్రీహరికోటకు 115 కిలో మీటర్ల దూరంలో సముద్రంలో కూలిపోతుంది.

విక్రమ్ ఎస్ తో నింగిలోకి మూడు ఉపగ్రహాలను పంపనున్నారు. వాటిలో ఒకటి స్వదేశీది కాగా.. రెండు విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. చెన్నైలోని ఏరోస్పేస్‌ స్టార్టప్‌ స్పేస్‌కిడ్స్‌ రూపొందించిన 2.5 కిలోల చిన్న ఉపగ్రహం ‘ఫన్‌-శాట్‌’ వీటిల్లో ఒకటి. ప్రయోగం మొత్తం 300 సెకెన్లలో పూర్తవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాబాయికి నివాళిగా ఈ రాకెట్‌కు ‘విక్రమ్‌-ఎస్‌’ అని పేరు పెట్టారు. ఇదే తొలి ప్రైవేటు మిషన్‌ కావడంతో దీనిని ప్రారంభ్‌ మిషన్‌గా పిలుస్తున్నారు.

ఈ ప్రయోగంపై కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘75 ఏళ్ల స్వతంత్ర భారత ప్రయాణంలో కొత్త మైలురాయికి నాంది పలుకుతూ తొలిసారి ప్రైవేట్ రాకెట్‌ను ప్రయోగించి చరిత్ర సృష్టించేందుకు ఇస్రో సిద్ధమైందని అన్నారు. అంతరిక్ష రంగంలో లేదా దేశంలో ప్రైవేట్ రాకెట్ల ఉనికిని పెంచడంలో ఇది ముఖ్యమైంది’’ అని వ్యాఖ్యానించారు.

ప్రైవేట్ రాకెట్లను ప్రయోగించడానికి ఇస్రోతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన మొదటి స్టార్టప్ స్కైరూట్. దేశీ మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ కాకుండా, ఇది స్కైరూట్ ఏరోస్పేస్ మొదటి మిషన్. అందుకే దీనిని ప్రారంభ్ అని పిలుస్తున్నారు. ఇది విదేశీ ఉపగ్రహంతో పాటు మొత్తం మూడు పేలోడ్‌లను అంతరిక్షంలోకి తీసుకువెళుతుంది.

అంతరిక్ష రంగంలో పరిశోధనలకు సుమారు 100 స్టార్ట్‌ప్లు తమ వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాయని చెప్పారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్. బెంగళూరు టెక్‌ సమ్మిట్‌ 2022లో భాగంగా ‘ఆర్‌ అండ్‌ డీ ఆఫ్‌ ఇండియా – ఇన్నోవేషన్‌ ఫర్‌ గ్లోబల్‌ ఇంపాక్ట్‌’ అనే అంశంపై గురువారం ఆయన ప్రసంగించారు. మరికొన్ని నెలల్లో చంద్రయాన్‌-3 మిషన్‌ ఉంటుందని చెప్పారు.