ISRO successfully carries out controlled re-entry experiment of MT-1 satellite
mictv telugu

ISRO : భూకక్ష్యలో ఉపగ్రహాన్ని కూల్చిన భారత్

March 8, 2023

 

ISRO successfully carries out controlled re-entry experiment of MT-1 satellite

అంతరిక్ష ప్రయోగాల్లో హద్దులను చెరిపేసుకుంటూ దూసుకుపోతోంది మన ఇస్రో. ఒకదాని వెంట మరొకటి ప్రయోగాలు చేపడుతూ మంచి సక్సెస్ కూడా కొడుతోంది. తాజాగా భూకక్ష్యలోనికి ప్రవేశించిన ఓ ఉపగ్రహాన్ని ఆకాశంలోనే ధ్వంసం చేసి మరో మెట్టు ఎక్కింది. ఇప్పటివరకూ ఈ పనిని అమెరికా, రష్యాలు మాత్రమే చేరగలిగాయి. ఇప్పుడు భారత్ కూడా వాటి సరసన చేరింది.

భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న మేఘ-ట్రోపికస్‌-1 ఉపగ్రహాన్ని విజయవంతంగా ధ్వంసం చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. దాదాపు పదేళ్ళ పాటు అంతరిక్షంలో ఉన్న ఈ ఉపగ్రహం మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 7.30 గంటల మధ్య భూ వాతావరణంలోకి ప్రవేశించింది. తర్వాత దానికదే విడిపోయి పసిఫిక్‌ సముద్రం పైన గగనతలంలో కాలి బూడిదైనట్టు ఇస్రో ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అంతరిక్ష వ్యర్థాల ఏజెన్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించామని శాస్త్రవేత్తలు చెప్పారు.

భూ వాతావరణ పరిస్థితుల అంచనా కోసం 2011 అక్టోబరు 12న ఫ్రెంచ్‌ స్పేస్‌ ఏజెన్సీ సహకారంతో మేఘ ట్రోపికస్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. అయితే పదేళ్ళ గడిచాక 2021 తర్వాత దీని పనితీరు పూర్తిగా నిలిచిపోయింది. భారత ఉపగ్రహాల వల్ వ్యర్ధాలు పేరుకుపోకుండా ఉండాలనే ఆలోచనతో దీన్ని కూల్చేసింది. ఆగస్టు 2022 నుంచి 120 కిలోల ఇంధనాన్ని మండిస్తూ 20 వ్యూహాత్మక శ్రేణి ద్వారా ఉపగ్రహం పెరిజీ క్రమంగా తగ్గించారు. చివరి డి-బూస్ట్ వ్యూహం అనేక విన్యాసాలు, పరిమితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రూపొందించారు. వీటిలో గ్రౌండ్ స్టేషన్‌లపై రీ-ఎంట్రీ ట్రేస్ దృశ్యమానత, లక్ష్యంగా ఉన్న జోన్‌లోని భూమి ప్రభావం, సహ వ్యవస్థలను అనుమతించదగిన ఆపరేటింగ్ పరిస్థితులు, ప్రత్యేకించి గరిష్టంగా థ్రస్టర్లను మండించగల సామర్థ్యం పరిగణనలోకి తీసుకున్నారు.

చివరి రెండు డీ-బూస్ట్ బర్న్‌లు మార్చి 7న వరుసగా 11:02 గంటలు, 12:51 గంటల సమయంలో ఉపగ్రహంలోని నాలుగు 11 న్యూటన్ థ్రస్టర్‌లను 20 నిమిషాల పాటు మండించినట్టు ఇస్రో తెలిపింది. చివరి పెరిజీ 80 కి.మీ కంటే తక్కువగా అంచనాకు వచ్చి, ఉపగ్రహం భూ వాతావరణంలోని దట్టమైన పొరల్లోకి ప్రవేశించి, తదనంతరం నిర్మాణాత్మక విచ్ఛిన్నానికి గురవుతుందని గుర్తించామని పేర్కొంది. అలాగే, రీ-ఎంట్రీ ఏరో-థర్మల్ ఫ్లక్స్ విశ్లేషణ పెద్ద శకలాలు మిగిలి ఉండవని నిర్ధారించినట్టు వివరించింది.