ఇస్రో గుర్రం మొరాయించింది.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇస్రో గుర్రం మొరాయించింది..

August 31, 2017

వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తాజా ప్రయోగం విఫలమైంది. గురువారం శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఇస్రో కదనాశ్వం పీఎస్ ఎల్వీ-329 రాకెట్ ప్రయోగం విఫలమైంది. నావిగేషన్ ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1 హెచ్‌ను తీసుకుని ఈ రాకెట్ నింగికెరిగింది. అయితే నిర్దేశిత సమయంలో రాకెట్ నుంచి ఉపగ్రహం బయటికి రాలేదు. హీట్ షీల్డ్ లో సమస్యల వల్ల శాటిలైట్ బయటిరాలేకపోయిందని భావిస్తున్నారు.  ప్రయోగం ఎందుకు విఫలమైందన్నదానిపై శాస్త్రవేత్తలు సమీక్ష నిర్వహిస్తున్నారు. ‘ నింగిలోకి దూసుకెళ్లి మూడు దశల్లో విజయవంతమైన పీఎస్‌ఎల్‌వీ సీ-39 సాంకేతిక లోపంతో నాలుగో దశలో విఫలమైంది. శాటిలైట్‌ హీట్ షీల్డ్ లోనే ఉండిపోయింది’ అని ఇస్రో చైర్మెన్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు.

నావిగేషన్‌ అవసరాల కోసం ఇస్రో గతంలో నావిక్ సిరీస్ లో ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. ఇందులో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఏ ఉపగ్రహంలోని మూడు పరమాణు గడియారాలు మొరాయించాయి. దాని స్థానంలో  1425 కేజీల బరువైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ను పంపారు.