ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. అతి పెద్ద రాకెట్ ఇస్రో బాహుబలి మార్క్ 3డీ1 నిమ్ములు చిమ్ముతూ సక్సెస్ ఫుల్ గా నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా సాయంత్రం 5.28 నిమిషాలకు జీఎస్ఎల్వీ రాకెట్ నింగికెగిసింది. జీఎస్ఎల్వీ-మార్క్3డీ1 విశేషాలు ఇవే….
భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన జీఎస్ఎల్వీ మార్క్ 3డీ1 ప్రయోగం కోసం దాదాపు 25.30 గంటలు కౌంట్‌డౌన్ సాగింది. ఇస్రో ఇప్పటి వరకూ ప్రయోగించిన రాకెట్లలోకి ఇదే అతిపెద్దది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజిన్ దీనిలో వినియోగించారు. దీనిద్వారా 3,136 కిలోల బరువుగల జీశాట్-19 సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడుతుంది.
ఈ రాకెట్ బరువు 640 టన్నులు. ఎత్తు 43 మీటర్లు. ఇందులో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో ఎస్200 మోటార్లు రెండు, రెండో దశలో ఎల్110 లిక్విడ్ కోర్ ఇంజిన్, మూడో దశలో సీ25 క్రయోజెనిక్ ఇంజిన్ ఉన్నాయి. ప్రయోగం అనంతరం 16.20 నిమిషాలకు జీశాట్-19 ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోనుంది. ఇది భూ అనువర్తిత బదిలీ కక్ష్యలోకి 4వేల కిలోలను, దిగువ భూ కక్ష్యలోకి 8వేల కిలోలను మోసుకెళ్తుంది.
జీశాట్-19తో 4జీ మరింత మెరుగ్గా..: జీశాట్-19 ఉపగ్రహంలో కేఏ బ్యాండు, కేయూ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లు ఉన్నాయి. దీని ద్వారా హైస్పీడు ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తాయి. 4జీ టెక్నాలజీ మరింత మెరుగుపడుతుంది. పాత తరానికి చెందిన ఐదారు కమ్యూనికేషన్ ఉపగ్రహాలు అందించిన సేవలను ఇదొక్కటే అందిస్తుంది. ఇందులోని అధునాతన పరిజ్ఞానమే కారణం. పదేళ్ల పాటు మార్క్ 3డీ1సేవలు అందిస్తుంది.