IT and ED Raids on Telangana Minister Gangula kamalakar
mictv telugu

మంత్రి గంగుల గ్రానైట్ కంపెనీలు, ఇళ్లపై ఐటీ, ఈడీ సోదాలు

November 9, 2022

తెలంగాణలో మరోసారి ఐటీ, ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు.. 30 బృందాలుగా విడిపోయి 40 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ కంపెనీలతో పాటు గ్రానైట్ కంపెనీల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తోన్నారు. ఇందులో భాగంగా.. మంత్రి గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్, మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్‌లో తనిఖీలు జరుగుతున్నాయి.

గంగుల ఇంటి తాళాలు పగులగొట్టి మరీ ఈడీ సోదాలు జరుపుతోంది. ఆయన సోదరుల ఇళ్లల్లోనూ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం గంగుల తన కుటుంబంతో సహా దుబాయ్‌లో ఉన్నారు. ఈడీ సోదాల నేపథ్యంలో హుటాహుటిన ఆయన కరీంనగర్‌కు బయల్దేరారు.

మరోవైపు హైదరాబాద్‌లోని పంజాగుట్టలోని పీఎస్‌ఆర్‌ గ్రానైట్స్‌, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్లలో తనిఖీలు నిర్వహించారు అధికారులు. సోమాజీగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్‌ నివాసంలోనూ సోదాలు జరిగాయి. కరీంనగర్‌లో గ్రానైట్‌ వ్యాపారి అరవింద్‌వ్యాస్‌తో పాటు మరికొంతమంది ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. గతంలోనే 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు తనిఖీలు చేస్తున్నారు.