మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ఇంటిపై ఐటీ దాడులు.. - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ఇంటిపై ఐటీ దాడులు..

November 1, 2022

IT conducts raids on Minister Jagadish reddy PA residence in Nalgonda

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను టీఆర్ఎస్ హై కమాండ్ మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం ఎన్నికల నిబంధనలను జగదీశ్ రెడ్డి అతిక్రమించారని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ఆయన పీఏ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేయడం నియోజకవర్గంలో సంచలనానికి తెర లేపింది. నల్లగొండలోని మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారుల బృందం చేరుకుంది. అక్కడ సోదాలు చేస్తున్నారు. భారీగా నగదు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాదాపు 30 మంది పైగా ఐటీ ఆఫీసర్లు, సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. పీఏ ప్రభాకర్​ రెడ్డి ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు దాచిపెట్టారన్న ఫిర్యాదు మేరకు హైదరాబాద్​కు చెందిన పలువురు ఐటీ ఉన్నతాధికారులు, నోడల్​ అధికారులు కలిసి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు,  డైరీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విశ్వనీయ సమాచారం మేరకు రూ.49 లక్షల నగదును సీజ్​ చేశారని సమాచారం. అయితే అధికారులు దీనిని ధ్రువీకరించలేదు. రాత్రి 11 గంటల వరకు సోదాలు కొనసాగుతుండటంతో ప్రభాకర్​ రెడ్డి ఇంటి సమీపంలో స్థానిక పోలీసులు, మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున గుమిగూడారు.