ఆర్థికమాంద్యం ప్రభావంతో టెక్ ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుతం ఆగమ్యగోచరంగా మారింది. ఉన్నట్టుండి విధుల నుంచి తొలగించడం, జీతాల్లో కోతలు పెట్టడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే వేలాది ఉద్యోగాలు గాల్లో కలిసిపోయాయి. ప్రముఖ కంపెనీలు సైతం లే ఆఫ్‌లు ప్రకటన చేశాయి. తాజాగా విప్రో కంపెనీ ఫ్రెషర్లకు విధించే జీతాల్లో భారీగా కోత విధించింది. రూ. 6.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి ఏడాది పాటు ట్రైనింగ్ పూర్తి చేసుకుని ప్రాజెక్ట్‌ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రూ. 3.5 లక్షల ప్యాకేజీతో ప్రాజెక్ట్‌లను టేకప్ చేస్తారా అని మెయిల్ పంపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది ఫ్రెషర్స్ కంపెనీ నిర్ణయానికి ఆమోదం తెలిపేశారు.
విప్రో వివాదస్పనిర్ణయంపై తీవ్ర దుమారం రేగుతోంది.
నచ్చితే మేము ఇచ్చిన జీతంతో పనిచేయండి..లేకపోతే వెళ్ళిపోండి అన్నట్టు విప్రో యాజమాన్యం వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విప్రోనిర్ణయంపై ఐటీ ఉద్యోగశాఖ తీవ్రంగా మండిపడింది. ఫ్రెషర్ల జీతాల ఆఫర్లను సగానికి తగ్గించడం అన్యాయమని పేర్కొంది. కంపెనీ తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఇదే విషయంపై కార్మిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. విప్రో నిర్ణయంపై చర్యలు తీసుకోకపోతే మిగతా కంపెనీలు ఇదే బాటలో పయనిస్తాయని ఫిర్యాదులో వెల్లడించింది.