It is with his inspiration that the language of Telangana became a giant: KCR
mictv telugu

ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ భాషకు పెద్దపీట: కేసీఆర్

September 5, 2022

తెలంగాణ భాషకు, కవిత్వానికి, అధ్యాత్మిక ధోరణులకు మహాకవి బమ్మెర పోతన స్ఫూర్తితోనే పెద్దపీట వేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బమ్మెర పోతన జయంతిని పురస్కరించుకుని ఆదివారం కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు.

”భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసి, తెలంగాణ భాషామృతాన్ని పంచిన సహజ కవి, సాహితీ తేజోమూర్తి బమ్మెర పోతన. పోతనామాత్యులు విరచించిన సాహితీశోభ తెలుగు సాహితీ చరిత్రలో అజరామరమై వెలిగిపోతుంది. బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్’ అంటూ ఆయన కావ్యాన్ని రాజులకు కాకుండా, భగవంతుడైన శ్రీరామునికే అంకితమిచ్చి, కవి ఆత్మగౌరవాన్ని చాటిన తెలంగాణ ప్రజాకవి పోతనామాత్యులు. భాగవతం ద్వారా రంగరించి, మనకు పోతన అందించిన పద్య గుళికలు, భక్తి మాధుర్యాన్ని, భాషా పాండిత్య రసాన్ని పంచుతాయని ప్రస్తుతించారు. భాగవతం ద్వారా అలతి అలతి పదాలతో శ్రీకృష్ణత త్వాన్ని సామాన్యులకు చేర్చిన పోతన ప్రజాకవి” అని కేసీఆర్ కొనియాడారు.

బమ్మెర పోతన.. జనగామ జిల్లా పాలకుర్తికి బమ్మెర గ్రామంలో జన్మించారు. పోతనామాత్యుని జన్మ స్థలంలో వారి జ్ఞాపకార్థం పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిందని, భవిష్యత్తులో బమ్మెర ప్రాంతాన్ని సాహితీ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఆ మహాకవి స్పూర్తితో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషకు, కవిత్వానికి, ఆధ్యాత్మిక ధోరణులకు పెద్దపీట వేస్తుందని కేసీఆర్ తెలిపారు.