IT raids are being conducted at Minister Malla Reddy's house for the second day as well
mictv telugu

రెండో రోజూ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు

November 23, 2022

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ అధికారులు దాడులు జరుపుతున్నారు. బుధవారం ఉదయం నుంచే ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు తనిఖీలు నిర్వహించి వెళ్లిపోయిన అధికారులు.. తిరిగి ఇవాళ ఉదయం మళ్లీ వచ్చారు. మల్లారెడ్డి కాలేజీల ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సోదరుడు గోపాల్ రెడ్డితో పాటు బంధువుల ఇళ్లల్లో రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డి కుటుంబానికి సన్నిహితులు, వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న వ్యక్తుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకు ఈ సోదాల్లో రూ.8.8 కోట్ల నగదుతో పాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కాగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి మొదలైన సోదాలు.. రాత్రి 12 గంటల వరకు కూడా కొనసాగాయి. కొంపల్లిలో ఉండే మంత్రి సమీప బంధువు సంతోష్ రెడ్డి కుటుంబసభ్యులు.. నిన్న ఉదయం సోదాలకు వెళ్లిన అధికారులను గుర్తించి.. లోపలి నుంచి గడియ పెట్టుకొని మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా తీయలేదు. అధికారులు తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నించటంతో చివరకు తలుపు తీశారు. దీంతో అధికారులు సోదాలు ప్రారంభించారు. బుధవారం కూడా ఈ సోదాలు కొనసాగుతోన్నాయి.