ముంబై, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను సోదాలు ముగిసాయి. ఢిల్లీ, ముంబై ఆఫీస్సుల్లో దాదాపు మూడు రోజులపాటు దాడులు నిర్వహించారు. గురువారం రాత్రి 10గంటల ప్రాంతంలో ఈదాడులు ముగిసాయి. బీబీసీ కార్యాలయాల నుంచి ఐటీ అధికారులు వెళ్లిపోయినట్లు బీబీసీ అధికార ప్రతిని ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
బీబీసీ (బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్) కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన ‘సర్వే ఆపరేషన్’ దాదాపు 60 గంటలకు పైగా సాగిన తర్వాత గురువారం ముగిసింది. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. ఈ సమయంలో అధికారులు ఎంపిక చేసిన ఉద్యోగుల ఆర్థిక సమాచారాన్ని సేకరించారు. వార్తా సంస్థ యొక్క ఎలక్ట్రానిక్ ,పేపర్ డేటా కాపీలను తయారు చేశారు. ఆదాయపు పన్ను శాఖ, పన్ను ఎగవేత ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా, మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ, ముంబైలోని బిబిసి కార్యాలయాల్లో ‘సర్వే ఆపరేషన్’ ప్రారంభించింది.
ఈ సర్వే చర్యలో భాగంగా ఐటీ అధికారులు అందుబాటులో ఉన్న స్టాక్‌ను జాబితా చేసి, కొంతమంది ఉద్యోగుల స్టేట్‌మెంట్‌లను నమోదు చేశారని, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ సర్వే దాదాపు 57-58 గంటల పాటు కొనసాగిందని ఆయన చెప్పారు. ఆర్థిక లావాదేవీలు, కంపెనీ నిర్మాణం, వార్తా సంస్థకు సంబంధించిన ఇతర వివరాలపై సర్వే బృందాలు సమాధానాలు కోరుతున్నాయని, ఆధారాలు సేకరించేందుకు ఎలక్ట్రానిక్ పరికరాల నుండి డేటాను కాపీ చేస్తున్నాయని బీబీసీ అధికారి చెప్పారు.
మండిపడుతున్న ప్రతిక్షాలు:
అయితే ప్రతిపక్ష పార్టీలు బిబిసిపై ఆదాయపు పన్ను శాఖ చర్యను “రాజకీయ ప్రతీకారం”గా అభివర్ణించాయి. ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన వారాల తర్వాత ఈ చర్య జరిగింది. ఈదాడులపై బీజేపీ ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి రాజకీయ చర్చ మొదలైంది. ఈ సోదాలు.. పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకమని విమర్శించాయి. అదానీ కేసులో జేపీసీ ఏర్పాటు చేయమని అడుగుతుంటే బీబీసీ వెంటపడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే BBC భారతదేశానికి వ్యతిరేకంగా “విషపూరితమైన రిపోర్టింగ్” అని బిజెపి ఆరోపించింది. ఈ చర్యపై ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.