ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపుతోంది. ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీలు తీసినందుకు ప్రతీకారంగా ఐటీ ఈ తతంగానికి దిగినట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీంతో ఐటీ అధికారులు వివరణ ఇచ్చారు. ‘‘బీబీసీ కార్యాలయాల్లో జరిగినవి సోదాలు కావు. సర్వే మాత్రం నిర్వహించాం. పన్నులు ఎగ్గొట్టారనే ఆరోపణలపై వివరాలను సేకరించాం. పన్ను వివరాలను, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నాం,’’ అని చెప్పారు. మంగళవారం ఉదయం అధికారులు బీబీసీ ఆఫీసులకు వెళ్లి సోదాలు చేశారని, ఉద్యోగులను నుంచి సెల్ ఫోన్లు తీసుకుని ఇళ్లకు వెళ్లమని చెప్పారని వార్తలు వచ్చాయి. గోధ్రా అల్లర్లకు సంబంధించి బీబీసీ మోదీని దోషిగా చూపుతూ తీసిన డాక్యుమెంటరీలపై వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. వీటిని కేంద్రం నిషేధించగా సుప్రీం కోర్టు ఆ నిర్ణయాన్ని తప్పుబట్టి నోటీసులు జారీ చేసింది.