IT rides concluded at Minister Mallareddy's residence
mictv telugu

మంత్రి మల్లారెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు..

November 24, 2022

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో రెండు రోజులు పాటు జరిగిన ఐటీ దాడులు ముగిశాయి. ఆయనను సోమవారం విచారణకు రావాలని అధికారులు నోటీసులిచ్చారు. ఈ సోదాల్లో భారీగా డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 10 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఐటీ సోదాలపై మంత్రి మల్లారెడ్డి ఫైరయ్యారు. తమ కుమారుడితో బలవంతంగా సంతకం తీసుకున్నారని ఆరోపిస్తూ.. ఐటీ అధికారి రత్నాకర్ పై బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. బలవంతంగా తప్పుడు లెక్కలతో తమ సంతకం తీసుకున్నారని మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో తమ కుమారుడిని కొట్టినట్లు తెలిపారు. ఐటీ అధికారులు కూడా మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ అధికారిని మల్లారెడ్డి బంధించారని..తాము సేకరించిన డాక్యుమెంట్లను చించివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ల్యాప్ టాప్‌ను కూడా బలవంతంగా లాక్కున్నారని ఐటీ అధికారులు ఆరోపించారు. ఐటీ శాఖ అధికారులు చేసిన ఫిర్యాదును దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు అధికారులు ట్రాన్స్ ఫర్ చేశారు. రెండు రోజులపాటు 65 బృందాలుగా.. 400 మంది అధికారులు ఈ సోదాలు చేశారు. భారీగా నగదుతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.