‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా తాజాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిరసనకారులు విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 46 మందిని అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. ఆర్మీ అభ్యర్ధుల వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన మెసేజ్‌ల ఆధారంగానే తమ దర్యాప్తును వేగవంతం చేశామని, అన్ని కోణాల్లో వివరాలను సేకరిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఆదివారం ఎస్పీ అనురాధ మీడియాతో మాట్లాడుతూ..”సికింద్రాబాద్ రైల్యే స్టేషన్‌పై దాడి చేస్తారని ఊహించలేదు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయాలని ఆర్మీ అభ్యర్ధులు ముందే ప్లాన్ చేసుకున్నారు. వారికి ట్రైనింగ్ ఇచ్చిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే ఈ దాడి చేయమని చెప్పారు. ఇందుకోసం ఈనెల 16నే కొన్ని వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి, పక్కా ప్రణాళికలతోనే దాడులు చేశారు. ఆందోళనకారులంతా ఆర్మీ అభ్యర్ధులే. వీరికి ఫిజికల్ టెస్టులు అయ్యాయి. ‘అగ్నిపథ్’ వల్ల వారికి అన్యాయం జరుగుతుందని ఈ దాడికి దిగారు. పోలీసుల దర్యాప్తులో మరి కొందరు అరెస్టు అయ్యే అవకాశం ఉంది. ఈ కేసును హైదరాబాద్ పోలీసులకు అప్పగించాం” అని ఆమె అన్నారు.
అయితే, ఆందోళన జరుగుతున్న సమయంలో సికింద్రాబాద్ రైల్యే స్టేషన్లో కాల్పులు జరిపింది తెలంగాణ పోలీసులు కాదని, కాల్పులు జరిపింది ఆర్పీఎఫ్ సిబ్బంది అని ఆమె స్పష్టం చేశారు. రైల్వేస్టేషన్లో ఉన్న ఆయిల్ డిపో, ఇంజిన్లకు మంటలు అంటుకుంటే భారీ విధ్వంసం జరిగి ఉండేదని, ఆ భారీ ప్రమాదాన్ని నిలువారించడానికే కాల్పులు జరపాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. ఆందోళనకారులు ఎంత చెప్పిన వినకపోవటంతోనే రైల్వే రక్షక దళం పోలీసులు 20 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఎస్సీ అనురాధ వివరాలను వెల్లడించారు.