రాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగువారుంటే బాగుండు: జీవీఎల్ - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగువారుంటే బాగుండు: జీవీఎల్

June 25, 2022

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ”రాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు రాష్ట్రాల వారుంటే ఎంతో బాగుండు. తెలుగువారుంటే తెలుగువాళ్లందరు ఎంతో సంతోషించేవాళ్లం. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై దేశవ్యాప్తంగా ఇంత సానుకూల వాతావరణం నెలకొనడం గత మూడు దశాబ్దాల్లో నేనెప్పుడు చూడలేదు.” అని ఆయన అన్నారు.

ఢిల్లీలో తాజాగా ఎన్డీఏ తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలి అనే దానిపై తెగ చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఢిల్లీకి రావాలని మోదీ ఆహ్వానం పలుకడంతో ఈసారి తెలుగు వ్యక్తి అయిన వెంకయ్య నాయుడినే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. సమావేశం అనంతరం బీజేపీ అధ్యక్షుడు నడ్డా తమ పార్టీ తరుపున ద్రౌపది మూర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తున్నామని ఆయన తెలిపారు. దాంతో తెలుగువాళ్లు నిరాశ చెందారు.

ఈ క్రమంలో శుక్రవారం జీవీఎల్ నరసింహారావు తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ..’ఆదివాసీ మహిళ, కౌన్సిలర్‌గా, ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా, గవర్నర్‌గా అన్ని విధాలా సుశిక్షితురాలైన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో పండగ వాతావరణం నెలకొంది. దేశానికి వన్నె తెచ్చే ఓ గొప్ప మహిళ ఆమె. ప్రతిపక్షాలు సైతం మద్దతు ఇస్తున్నాయి’ అని జీవీఎల్ పేర్కొన్నారు.