తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఇటీవలే ఢిల్లీలో ‘నేను ప్రధానిని కలిసింది. తెలంగాణ సర్కారుపై ఫిర్యాదు చేసేందుకు కాదు. తెలంగాణలో నాకు ఎవరితోనూ విభేదాలు లేవు. కానీ, గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదు” అని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గవర్నర్ తమిళిసైపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి మాట్లాడుతూ.. ”గవర్నర్ చట్ట పరిధి దాటి మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదు. రాజ్యాంగ పరమైన హోదాలో ఉన్న గవర్నర్.. వారి పరిమితులకు లోబడి మాట్లాడాలి. గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ప్రభుత్వంపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే, బాధ్యతా రాహిత్యం అవుతుంది. మీడియాతో గవర్నర్ రాజకీయాలు మాట్లాడకూడదు” అని తలసాని అన్నారు. అంతేకాకుండా గవర్నర్ ఎలా గౌరవించాలో తమతోపాటు తమ ముఖ్యమంత్రికి తెలుసు అని అన్నారు.
మరోపక్క ఇటీవలే మంత్రి జగదీష్ రెడ్డి సైతం గవర్నర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. ”గవర్నర్ తమిళిసై బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలు దురదృష్టకరం. గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటిస్తుంది. గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుని, బీజేపీ రాజకీయాలు చేస్తోంది” అని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు.