పుంజు కూసిందే పాపమైంది.. యజమానికి రూ.15 వేల ఫైన్  - MicTv.in - Telugu News
mictv telugu

పుంజు కూసిందే పాపమైంది.. యజమానికి రూ.15 వేల ఫైన్ 

August 15, 2020

Italian man gets fined over rooster’s constant early-morning crowing

పల్లెటూర్లలో ఉదయం పొద్దు పొడవక ముందే కోడిపుంజు కొకొరొకో అని కూస్తున్న విషయం తెలిసిందే. దానిని ప్రకృతి అలారంగా భావించే పల్లె ప్రజలు అప్పుడే నిద్రలేచి, ఇల్లువాకిలి పారగొట్టి, అలుకపూతలు ముగించుకుని, స్నానాలు, వంట, మంచినీళ్లు తెచ్చుకుంటారు. అనంతరం తొమ్మిదిన్నరకల్లా సద్ది కట్టుకుని పొలం పనులకు పరుగెత్తుతారు. మళ్లీ సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో పొలంలో వంచిన నడుము ఎత్తకుండా పని చేస్తారు. ఇలా ఉదయం కోడిపుంజు, సాయంత్రం పొద్దు గూట్లో పడేవరకు ప్రజలు తమ పనులకు ఓ పరిధి వేసుకుంటారు. అయితే ఓచోట కోడిపుంజు కూసిన పాపానికి దాని యజమానికి ఇరుగుపొరుగు వారు కలిసి రూ.15 వేల జరిమానా విధించారు. ఇటలీ లంబార్డీలోని కాస్టిరగా విదార్దో పట్టణంలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. విదార్దోలో నివాసం ఉంటున్న ఎంగేలో బొలెట్టీ(80) అనే వృద్ధుడు కార్లినో అనే కోడిపుంజును పెంచుకుంటున్నాడు. 

ఆ పుంజు ప్రతిరోజూ ఉదయం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు నాన్‌స్టాప్‌గా కొకొరొకో అని కూస్తూనే ఉంటుంది. దీంతో ఇరుగుపొరుగు వారు దాని కూతలకు తమ నిద్రకు భంగం కలుగుతోందని యజమాని ఇంటికి గొడవకు వచ్చారు. కిమ్మనకుండా ఆయన తన కోడిపుంజుకు నచ్చజెప్పుకుంటానని చెప్పాడు. కానీ, అది ఆయన మాట వింటుందా? వేరేచోట కమ్మినా దాని ప్రాకృతిక ధర్మాన్ని విస్మరించకుండా కూస్తూనే ఉంది. దీంతో విసుగెత్తిన ఇరుగుపొరుగువారు మరింత అసహనానికి లోనయ్యారు. ఆ పుంజు యజమాని మీద ఏకంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు బెలెట్టీ ఇంటి మీద నిఘా ఉంచారు. వారు చెప్పిన సమయంలోనే కోడి కూస్తుందని అతడికి 200 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.15 వేలు) జరిమానా విధించారు. పోలీసుల తీరుకు పుంజు యజమాని నొచ్చుకున్నాడు. ‘పదేళ్లుగా ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న కోడిపుంజును ఇరుగుపొరుగు వారి గోల భరించలేక మా స్నేహితుడికి అమ్మేశాను. అతను వేరే ఊరెళ్తూ నా వద్ద వదిలేసి వెళ్లాడు. 20 రోజుల నుంచి నా వద్దే ఉంది’ అని పోలీసుల వద్ద యజమాని వాపోయాడు. తనపై విధించిన ఈ జరిమానాపై ప్రస్తుతం ఆయన అధికారులతో పోరాడుతున్నాడు. కాగా, ఇటలీలో పెంపుడు జంతువులు పెంచుకునేవారికి ఒక నిబంధన ఉంది. పక్కంటివారికి 10 మీటర్ల దూరంలో పెంపుడు జంతువులను ఉంచాలి. అయితే ఆ నిబంధన గురించి తనకు తెలియదు, క్షమించండి అంటున్నాడు బెలెట్టీ.