ఇది నా డ్యూటీ.. అసెంబ్లీ సమావేశాలకు 8 నెలల గర్భిణీ ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

ఇది నా డ్యూటీ.. అసెంబ్లీ సమావేశాలకు 8 నెలల గర్భిణీ ఎమ్మెల్యే

February 29, 2020

Pregnant MLA.

8 నెలల గర్భిణీ అయిన ఎమ్మెల్యే మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు అవుతున్నారు. 30 ఏళ్ల వయసు ఉన్న ఆమె పేరు నమితా ముందాడ. గర్భిణి అయివుండి సమావేశాలకు హాజరు అవడం ఆరోగ్య పరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మీడియా ఆమెను ప్రశ్నించింది. తాను డాక్టర్ సలహా తీసుకునే ఈ సమావేశాల్లో పాల్గొంటున్నానని వివరించారు. నమితా ముందాడ బీడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. వివాహం అయ్యాక మొదటిసారి ఆమె గర్భం దాల్చారు. ఇప్పుడు ఆమె 8 నెలల గర్భిణి. అయినా ఆమె ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకోకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తొలి గర్భిణీ ఎమ్మెల్యే అని కొంతమంది అంటున్నారు. 

గర్భిణీ అయిన మీరు ఇలా సమావేశాలకు వస్తున్నారు…ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి కాదా? అని మీడియా ప్రశ్నించింది. అందుకు ఆమె సమాధానం ఇస్తూ.. ‘గర్భవతిని అయినా ప్రజా ప్రతినిధిగా నా నియోజకవర్గంలోని సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత. అందుకే నా ప్రజలు నాకు ఓట్లు వేశారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడం ఎమ్మెల్యేగా నా కర్తవ్యం. డాక్టర్ సలహాలను పాటిస్తూనే ప్రజల కోసం అసెంబ్లీ సమావేశానికి వచ్చాను.  గర్భిణీగా అందరికీ ఉన్నట్లుగా తనకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాగని ఓ ప్రజా ప్రతినిధిగా ఉంటూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం కూడా నా బాధ్యతగా భావిస్తున్నాను’ అని నమిత తెలిపారు. కాగా, నమిత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో చేరి బీడ్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు.