హైదరాబాద్ బిర్యానీని మించి పేరు తెచ్చుకుంటాయి: ఇవాంకా - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ బిర్యానీని మించి పేరు తెచ్చుకుంటాయి: ఇవాంకా

November 28, 2017

భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తి అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ కొనియాడారు. హైదరాబాద్ హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఆమె మంగళవారం ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. ఆద్యంతం చిర్నవ్వులు చిందిస్తూ.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మెచ్చుకుంటూ ప్రసంగించారు. ప్రాచీన హైదరాబాద్ నగరంలో ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ ఇన్నోవేషన్ హబ్ గా మారిందని, తన పిల్లలను కూడా ఇక్కడి స్కూళ్లకు పంపించాలని అనుకుంటున్నానని చెప్పారు.

‘150 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటి… కొత్త ఆవిష్కరణలకు ముందుకొస్తున్న యవతీయువకులకు స్వాగతం. హైదరాబాద్‌ ఇన్నోవేషన్‌ హబ్‌గా ఎదుగుతోంది. భారత అంతరిక్ష విజ్ఞానం చంద్రుడిని దాటి అంగారకుడి దాకా వెళ్లింది. కొత్త ఆవిష్కరణలతో వస్తున్న ఔత్సాహికులు విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వస్తున్నారు.  ఔత్సాహిక వ్యాపారవేత్తలు కాంక్ష వదలకుండా నిరంతరం పని చేయాలి’ అని అన్నారు.

భారత్‌ అమెరికాకు నిజమైన మిత్రదేహని అధ్యక్షుడు ట్రంప్‌ చెబుతుంటాని ఆమె తెలిపారు. ‘అందమైన భారత దేశానికి రావాలంటూ మాకు ఆహ్వానం అందింది. ప్రపంచ ప్రఖ్యాత బిర్యానికీ హైదరాబాద్‌ పుట్టినిల్లు. ముత్యాల నగరంలో యువతే విలువైన సంపద. పారిశ్రామిక వేత్తలు సరికొత్త విప్లవం సృష్టిస్తున్నారు. రేయింబవళ్లు కష్టపడుతూ రోబోలు, యాప్‌లు తయారు చేస్తున్నారు. భారత దేశం..  ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టి-హబ్‌ తయారైంది’ అని అన్నారు. భారతీయ టెక్నాలజీ కంపెనీలు ప్రపంచ ప్రఖ్యాత హైదరాబాద్ బిర్యానీ కంటే గొప్ప పేరు తెచ్చుకుంటాయన్నారు.

ఈ సదస్సులో పాల్గొన్నవారిలో 52శాతం మహిళలు ఉన్నందుకు గర్వకారణంగా ఉందన్నారు. పురుషాధిక్య సమాజంలో రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలని పేర్కొన్నారు. గత పదేళ్లలో మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య 10శాతం పెరిగిందని,  ఇప్పుడు అమెరికాలో కోటీ 10లక్షలమంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారని వివరించారు. మహిళలకు సాధికారత వచ్చినప్పుడే మన కుటుంబాలు, ఆర్థిక వ్యవస్థలు పూర్తిస్థాయిలో ప్రగతి సాధిస్తాయన్నారు. మహిళల సాధికారంత కోసం మోదీ కృషి చేస్తున్నారని కితాబిచ్చారు.