ఇవాంకా వచ్చేసింది.. అంతా సీక్రెట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకా వచ్చేసింది.. అంతా సీక్రెట్

November 28, 2017

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు సందడి మొదలైంది. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా తన బృందంతో కలసి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. నల్లరంగు, తెల్లచారల దుస్తుల్లో ఉల్లాసంగా కనిపించారు. ఆమెకు తెలంగాణ అధికారులు, అమెరికా అధికారులు స్వాగతం పలికారు.

ఇవాంకా తర్వాత తన కాన్వాయ్‌లో ట్రైడెంట్ హోటల్‌కు వెళ్లి ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. మొదట వెస్ట్‌ఇన్ హోటల్‌లో ఆమె బస చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో బసను ట్రైడెంట్‌కు మార్చారు. అమెరికా నిఘా అధికారుల ఆదేశాల ప్రకారమే ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ హోటల్ సదస్సు జరిగే హెచ్‌ఐసీసీకి పది నిమిషాల ప్రయాణ దూరంలో ఉంది.

 

సిటీలో 40 గంటలు

ఇవాంకా భాగ్యనగరంలో 40 గంటలు ఉంటారు. ఇందులో 18 గంటలు ఆమె విశ్రాంతి, ఇతర వ్యక్తిగత పనులు ఉంటాయి. భద్రతా కారణాల వల్ల ఈ వివరాలను అత్యంత రహస్యంగా ఉంచారు. ఇవాంకా బుధవారం రాత్రి 9.20 గంటల వరకు స్వదేశానికి బయల్దేరతారు.  మంగళవారం మధ్యాహ్నం మొదలయ్యే జీఈఎస్ సదస్సుకు ఇవాంకా, మోదీ, సుష్మా స్వరాజ్ తదితర  ప్రముఖులు హాజరవుతారు.

రాత్రి విందు..

మంగళవారం రాత్రికి భారత ప్రభుత్వం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జీఈఎస్ ప్రతినిధులకు విందు ఇవ్వనుంది. ఇవాంకా బుధవారం ఉదయం పారిశ్రామిక సదస్సు ప్లీనరీ సెషన్‌లో మాట్లాడి మళ్లీ  హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం చేసి హోటల్లోనే మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. సాయంత్రం 5:35 గంటలకు హోటల్‌ ఖాళీ  చేసి రాత్రి 8.20కి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుంటారు. ఈ విరామ సమయంలో ఏం చేస్తారో బయటికి చెప్పడం లేదు. గోల్కొండ హోటల్లో విందు ఉంటుందని వార్తలు వచ్చినా సస్పెన్స్ కొనసాగుతోంది.