ఇవాంకా.. జపాన్‌లో చదివిందే.. హైదరాబాద్‌లో వల్లించింది.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకా.. జపాన్‌లో చదివిందే.. హైదరాబాద్‌లో వల్లించింది..

December 2, 2017

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో జేఈఎస్‌లో ఇవాంకా ట్రంప్ ప్రసంగంపై  విమర్శలు వినబడుతున్నాయి. హైదరాబాదులో నిర్వహించిన ఈ సదస్సులో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం విదితమే. కాగా ఆమె ఇక్కడ మాట్లాడిన మాటలపై అమెరికాలో పెద్ద చర్చ జరుగుతున్నది.

‘ఇవాంకా ట్రంప్‌ రీసైకిల్స్‌ హెర్‌ ఓన్‌ స్పీచ్‌ ఇన్‌ ఇండియా’  శీర్షికతో న్యూస్ వీక్ పత్రిక ప్రచురించిన కథనంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గత నెల 2న టోక్యోలో జరిగిన ‘ వరల్డ్ అసెంబ్లీ ఫర్ విమెన్ (వావ్) ’లో చేసిన ప్రసంగాన్నే కాస్త అటు ఇటుగా మార్చి హైదరాబాద్‌లో ఇవాంకా చదివేశారని ‘న్యూస్‌వీక్ ’ పత్రిక పేర్కొంది. అంటే ఆమె రాసుకున్న స్క్రిప్టును ఫాలో అవుతుందంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడివి ఒకటి రెండు పరిసరాలు, మనుషుల పేర్లు జతచేసి అదే ప్రసంగాన్ని గడగడా చదివేస్తుందనే కామెంట్లు చేస్తున్నారు నెటిజనులు. ఆమె ప్రసంగంలోని కొన్ని చిన్నచిన్న పదాలు తప్ప మిగతావన్నీ అచ్చు గుద్దినట్టు అలాగే వున్నాయని పత్రిక  పేర్కొంది.

‘ ఈ ముత్యాల నగరిలో  గొప్ప నిధి మీరే ’లాంటి చిన్నచిన్న పదాలు మాత్రమే కొత్తగా వాడారని, మిగతాదంతా స్క్రిప్టును ఫాలో అయ్యారని అంటోంది న్యూస్ వీక్.  ‘ మహిళలు పనిచేస్తే దాని ప్రభావం ద్విగుణీకృతం అవుతుంది. మహిళలే పురుషుల కన్నా ఎక్కువ అవకాశాలు ఇవ్వగలుగుతారు ’  అన్న వాక్యాలను టోక్యో కథనం నుండి ఉన్నది ఉన్నట్టు ఎత్తేసి మాట్లాడారని తన కథనంలో పేర్కొంది. మహిళలు వారి సంపాదనను తిరిగి సమాజంలోనే పెట్టుబడిగా పెడతారన్న వాక్యాలు కూడా అక్కడివేనని వివరించింది.

కాగా ప్రముఖులు మాట్లాడుతున్నప్పుడు కొన్ని పదాలు పునరావృతమవడం సహజమని కొందరు ఇవాంకకు వత్తాసు పలుకుతున్నారు.