సాధారణ పరిస్థితుల ద్వారా పిల్లలు పుట్టకపోతే ఏ దంపుతులైనా ఏం చేస్తారు? ఇతర మార్గాలు వెతుక్కుంటారు. అందులో ఒక మార్గమే ఐవీఎఫ్. అయితే దీనివల్ల మహిళలకు సమస్యలు తప్పవని ఒక అధ్యయనం చెబుతున్నది.
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) పిల్లలు పుట్టని వారికి ఒక వరంలా పనిచేస్తుంది. కానీ అదే పద్ధతి మహిళ శరీరాలకు మాత్రం నష్టం కలిగిస్తుందని ఒక అధ్యయనం చెబుతున్నది. ఈ పద్ధతి ద్వారా గర్భం దాల్చడం వల్ల ప్రీఎక్లాంప్సియాను అభివృద్ధి చేసే ప్రమాదం రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో పాటు హైబీపీ కూడా ఎక్కువ గురవుతారు.
ప్రమాద హెచ్చరిక..
ప్రీఎక్లాంప్సియా అనేది గర్భిణీ స్త్రీకి, శిశువుకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. దీనివల్ల శరీరంలోని అవయవ నష్టం జరుగుతుంది. దీన్ని ఒక గర్భాధారణ సమస్యగా పరిగణిస్తారు. అంతేకాదు.. అధిక రక్తపోటు కూడా బాధిస్తుంది. సంప్రదాయ గర్భాలతో పోలిస్తే ఈ కృత్రిమ గర్భాధారణలో ప్లాసెంటా భిన్నంగా అభివృద్ధి చెందుతుందని పరిశోధకులు తెలిపారు. ఇది ప్రీఎక్లాంప్సియాను పెంచుతుంది.
ఈ అధ్యయనం కోసం..
వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ కార్డియాలజీతో కలిసి అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వార్షిక సైంటిఫిక్ సెషన్ లో ఈ అధ్యయనం గురించి వెలువరించారు. దీంట్లో పరిశోధకులు 5,784 ఐవీఎఫ్ గర్భాలు, 2.2 మిలియన్లకు పైగా సంప్రదాయ గర్భాలను పరిశీలించారు. దీనిద్వారా గుండె సంబంధ సమస్యలు తలెత్తుతాయని కూడా కనుగొన్నారు. భవిష్యత్తులో కిడ్నీ, హృదయ సంబంధ సమస్యలు, కొరోనరీ ఆర్టరీ వ్యాధి, స్ట్రోక్ ప్రమాదాలను కూడా పెంచుతాయని అంటున్నారు. అయితే ఇతర సాంకేతిక పరిజ్ఞానాల కంటే కొన్ని రకాల పునరుత్పత్తి సాంకేతికతలు ప్రీఎంక్లాప్సియా, అధిక లేదా తక్కువ ప్రమాదాన్ని అందిస్తాయో లేదో తెలుసుకోవడానికి డేటాను మరింత విశ్లేషించాలని పరిశోధకులు భావిస్తున్నారు. ముందస్తుగా గుర్తించడం, సమస్యలను సముచితంగా పర్యవేక్షించాలని కూడా వారు అంటున్నారు.