ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్థస్త్ కామెడీ షో గురించి తెలియని వాళ్లు ఉండరు. ఎంతోమంది కమెడియన్లు ఈ షో ద్వారా తమ టాలెంట్‌ని నిరూపించుకొని, సినిమాల్లో ఛాన్సులు పొందినవారు కూడా ఉన్నారు. మరికొంతమంది ఆ షో వల్లనే పాపులర్ అయి.. బయటకి వచ్చి దానిపై విమర్శలు చేసిన వారూ ఉన్నారు. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడడం కూడా టైమ్ వేస్టే అంటూ సీనియర్ జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ అన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ కొత్త పెళ్లికొడుకు.. జబర్ధస్త్ తనకు జీవితాన్ని, జీవిత భాగస్వామిని కూడా ఎన్నుకునే అవకాశం ఇచ్చిందని చెబుతూనే మరికొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ క్రమంలో కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం గురించి ప్రస్తావనకు వచ్చింది.నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సక్సెస్ జబర్దస్త్ వలనే అంటారా? అని అడిగిన యాంకర్ ప్రశ్నకు సమాధానంగా… ఎవరు ఏం చేసినా అది జబర్దస్త్ బిక్షే. అది మల్లెమాల భిక్షే అన్నారు. మరో ప్రశ్నగా… కిరాక్ ఆర్పీని మీరు ఎప్పుడైనా కలిశారా? అని అడగడం జరిగింది. కలవలేదు. మాకు అంత అదృష్టం లేదు. వాళ్ళు పెద్దోళ్ళు. మేమేదో చిన్న ఆర్టిస్టులం, అని చెప్పాడు.గతంలో మల్లెమాలను ఉద్దేశిస్తూ ఆర్పీ అనేక ఆరోపణలు చేశారు. దీనిపై మీ కామెంట్? ఏంటని అడగ్గా.. నిజం ఏంటనేది జనాలకు తెలుసు. దీనికి గురించి మాట్లాడటం అనవసరం. టైం వేస్ట్ టాపిక్ అని కొట్టిపారేశారు.
ఇక జబర్ధస్త్‌లో తన ఎదుగుదల గురించి చెబుతూ.. 11 ఏళ్లుగా తాను ఈ షో లోనే ఉన్నానని చెప్పారు, మిగతా వాళ్లలో వెళ్లి వచ్చిన వాళ్లు ఉన్నారని.. తాను, రాకెట్ రాఘవ మాత్రం జబర్ధస్త్ షో లోనే ఉన్నామన్నారు. చిన్నపిల్లలతో స్కిట్లు చేయడం తనకు, తన స్వభావానికి , వ్యక్తిగతంగా మంచి జరిగిందని చెప్పారు. ఎదుటివారిని కించపరిచి, తక్కువ చేసి మాట్లాడడం వెకిలితనం అవుతుంది కానీ కామెడీ కాదని చెప్పారు. తాను అలాంటి వెకిలి చేష్టలకు దూరమని తెలిపారు.