ఇన్నాళ్లూ పచ్చిబూతులకు, మనోవికారాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈటీవీ జబర్దస్త్ రానురాను బరితెగించిపోతోంది. అనాథ పిల్లలను అవమానించిన ఆది కామెడీ తీవ్ర విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా పొట్టుకూటి కోసం గల్ఫ్‌కు వెళ్తున్న తెలంగాణ కష్టజీవులను కూడా జబర్దస్త్ అవమానించింది. వారిని అనరాని మాటలూ అంది. కామెడీ పేరుతో ఒక ప్రాంత ప్రజల మనోభావాలను, అది కూడా కష్టజీవుల మనసులను దారుణంగా గాయపరిచింది. దీనిపై కరీంనగర్ జిల్లా ప్రజలతో పాటు అటు గల్ఫ్‌కు వలసవెళ్తున్న రాయలసీమ ప్రజలూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=7VaJFJxbB-0&feature=youtu.be
ఏమన్నారు?
షోలో జగిత్యాల బోర్డు పెట్టి గబ్బుగలీజ్ భాషణలు వినిపించారు. ఒక తల్లి(అవినాశ్) పనీపాటా లేని తన తాగుబోతు కొడుకు రాజు(కార్తీక్)ను తిడుతుంది. పక్కింటి సురేశ్ భార్యను వదలి గల్ఫ్ వెళ్లి పని చేసుకుంటున్నాడని, నువ్వు పడుకుని నిద్రపోతున్నావని అంటుంది. దీంతో రాజు… ‘వాడు జాబ్ చూసుకుంటున్నాడు, వాడి పెళ్లాన్ని నేను చూసుకుంటున్నాను.. ’ అని అంటాడు. వలసకార్మికులను కించపరిచే మరికొన్ని సంభాషణలు కూడా ఇందులో ఉన్నాయి. దీనిపై తెలంగాణ ప్రజలతో పాటు హక్కుల సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. జీవనోపాధి కోసం పరాయి దేశాలకు వెళ్తున్న పేదలను అవమానించడం సరికాదని, జబర్దస్త్ నిర్వాహకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మీరు షూటింగులకు వెళ్తే ఎవరు చూసుకుంటున్నారు?
ఈ అసభ్య సంభాషణపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.. ‘మీరు రోజుల తరబడి జబర్దస్త్ షూటింగ్ కు వెళ్లినప్పుడు మీ భార్యలను ఎవరు చూసుకుంటున్నారు?’ అని సదరు వెకిలి నటులను ప్రశ్నిస్తున్నారు. క్షమాపణ చెప్పకపోతే గల్ఫ్ బిడ్డలు జబర్దస్త్ నటులను బట్టలూడదీసి కొడతారని హెచ్చరిస్తున్నారు. ‘అతిగా ఆవేశపడే ఆడదానికి, అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారు’ అని గతంలో జబర్దస్త్ ఆది అన్న నీచ డైలాగుపై విమర్శలు రావడం, కేసు పెట్టడం తెలిసిందే.