న్యూజిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా లేబర్ పార్టీ నేత క్రిస్ హిప్కిన్స్ ప్రమాణస్వీకారం చేశారు. కాగా జసిందా ఆర్డెర్న్ గత వారం ఊహించని విధంగా ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో న్యూజిలాండ్ 41వ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తాను ఆర్థిక వ్యవస్థను బాగుచేసేందుకు దృష్టి సారిస్తానని 44 ఏళ్ల హిప్ కిన్స్ వాగ్ధానం చేశారు. దేశానికి నాయకత్వం వహించే సత్తా ఇక తనలో లేదని జెసిండా పేర్కొన్న విషయం తెలిసిందే. ఆమె రాజీనామాను గవర్నర్ జనరల్ సిండీ కిరో ఆమోదించారు. కోవిడ్ సంక్షోభ సమయంలో హిప్కిన్స్ మంత్రిగా చేశారు. అప్పుడు ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు హిప్కిన్స్కు భారీ మద్దతు లభించింది. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న జనరల్ ఎలక్షన్స్‌లో లేబర్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే హిప్కిన్స్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కొత్త ప్రధానికి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి 9 నెలల కంటే తక్కువ సమయం ఉంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం లేబర్ పార్టీకి పాపులారిటీ తగ్గినట్లు తెలుస్తోంది. బుధవారం రోజున హిప్కిన్స్ తొలి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.