మాజీ భార్యపై పరువు నష్టం కేసులో గెలిచిన జాక్ స్పారో - MicTv.in - Telugu News
mictv telugu

మాజీ భార్యపై పరువు నష్టం కేసులో గెలిచిన జాక్ స్పారో

June 2, 2022

హాలీవుడ్ స్టార్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ హీరో జానీ డెప్ (58) తన మాజీ భార్యపై పరువు నష్టం దావా వేసి ఆ కేసులో గెలిచాడు. అంబర్ హర్డ్ (36)ను 13.50 మిలియన్ డాలర్లు జరిమానాగా చెల్లించాలని వర్జీనియాలోని కౌంటీ కోర్టు ఆదేశించింది. ఏడుగురు సభ్యుల కోర్టు తీర్పుపై జానీ డెప్ హర్షం వ్యక్తం చేయగా, అంబర్ హర్డ్ కోర్టులోనే ఏడ్చేసింది. వివరాల్లోకెళితే.. జానీ డెప్, అంబర్ హర్డ్‌లు 2015లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఏడాదికే కాపురంలో కలతలు రావడంతో 2017లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అక్కడితో ఆగకుండా ఒకరి మీద ఒకరు జుగుప్సాకరమైన రీతిలో ఆరోపణలు చేసుకోవడం ప్రారంభించారు. మొదట అంబర్ హర్డ్ మొదలుపెట్టింది. జానీ డెప్ పేరు ఎత్తకుండా వైవాహిక జీవితంలో ఉండే గృహహింస గురించి ఓ ఆర్టికల్ రాసింది. దాంతో చిర్రెత్తిన డెప్ 2018లో 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం దావా వేశాడు. అంతేకాక, తనను ఎలా హింసించిందీ, కుబేరుడు ఎలాన్ మస్క్‌తో ఎఫైర్ గురించి దావాలో పేర్కొన్నాడు. దీనికి ప్రతిగా ఆమె కూడా 2020లో 100 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని కోరుతూ పరువు నష్టం దావా వేసింది. ఇలా ఇద్దరూ ఒకరిపై మరొకరు కేసు వేయడంతో కోర్టు కేసును ఆరు వారాల పాటు విచారించింది. ఫైనల్‌గా బుధవారం తీర్పునిస్తూ అంబర్ హర్డ్ వేసిన దావాను కొట్టివేసింది. అయితే ఇద్దరూ పరువు నష్టం పొందేందుకు అర్హులేనంటూ జానీ డెప్‌కు కూడా 2 మిలియన్ డాలర్ల జరిమానాను కోర్టు విధించింది. తీర్పు విన్న అంబర్ ‘ఈ తీర్పుతో మహిళలందరికీ అన్యాయం జరిగింది. తనకున్న పేరు, ప్రఖ్యాతులతోనే నా మాజీ భర్త ఈ కేసు గెలిచాడు’ అని వ్యాఖ్యానించగా, జానీ డెప్ ‘నా జీవితాన్ని నాకు తిరిగి ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. కాగా, ఈ వివాదం యొక్క ప్రభావం ఇద్దరి కెరీర్ మీద పడింది. రచ్చకెక్కడంతో అవకాశాలు మునుపటిలా లేకుండా పోయాయి.