‘జుమ్మేకి రాత్..’.. అంటూ సల్మాన్ ఖాన్ తో చిందులేసి అటు బాలీవుడ్ ని.. ‘రారా రక్కమ్మ..’ అంటూ కిచ్చ సుదీప్ తో ఆడిపాడి ఇటు టాలీవుడ్ లోను క్రేజ్ దక్కించుకున్న బోల్డ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. శ్రీలంకకి చెందిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ టు టాలీవుడ్ క్రేజీ ఐటం సాంగ్స్ తో దూసుకెళ్తున్న సమయంలో అనూహ్యంగా ఈమె కెరీర్ రివర్స్ అయిపోయింది. జాక్వెలిన్ రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇరుక్కుని సినిమా అవకాశాలు లేక అష్టకష్టాలు పడుతుంది. అయితే తాజాగా ఈ కేసులో ఢిల్లీ పటియాలా కోర్టుకి తన వాంగ్మూలాన్ని జాక్వెలిన్ సమర్పించింది. “కాన్‌మ్యాన్ సుకేష్ చంద్రశేఖర్ నా జీవితాన్ని నాశనం చేశాడు. నా భావోద్వేగాలతో ఆడుకున్నాడు. నా జీవితాన్ని నరకం చేసాడు” అని నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కోర్టుకు ఒక ప్రకటనలో తెలిపింది.
“సుకేష్ చంద్రశేఖర్ నన్ను తప్పుదోవ పట్టించాడు, నా కెరీర్ నా జీవనోపాధిని నాశనం చేశాడు. సన్ టీవీ యజమానిగా పరిచయం చేసుకుని.. జయలలిత బంధువుగా దెగ్గరయ్యాడు. ఖరీదైన 5 బ్రాండెడ్ వాచీలు, 20 వరకు నగలు, మసాజ్ చైర్‌తో పాటు బట్టలు, బ్యాగులు, ఇతరత్రా బహుమతులు తీసుకున్న మాట వాస్తవమైనా.. సౌత్ సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించాడు. కానీ నాకు ఎలాంటి సినిమాలు రాలేవు. సొంతంగా నేను తెచ్చుకున్న చిత్రాల నుండి నన్ను తొలగించారు కూడా. సౌత్ సూపర్ స్టార్ నాగార్జున తనని సినిమాలో తీసుకుని ఆ తరువాత తీసేసాడు” అంటూ కోర్టుకి తెలిపింది. ఇక నాగార్జున సినిమా “ది ఘోస్ట్”లో కూడా ఈ భామ నటించాల్సి ఉంది. కానీ ఈ కేసుల సమస్యల కారణంగా ఆమె స్థానంలో మరొక నటిని తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల రణవీర్ సింగ్ సినిమా నుండి కూడా తప్పించినట్టు సమాచారం. ఇక సుకేశ్.. జాక్వెలిన్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ ఫోటోల్లో జాక్వెలిన్ సుకేశ్‌తో చాలా సన్నిహితంగా ఉన్నట్లు కనిపించింది.