దంచికొట్టిన జడేజా.. మాయ చేసిన అశ్విన్ - MicTv.in - Telugu News
mictv telugu

దంచికొట్టిన జడేజా.. మాయ చేసిన అశ్విన్

March 5, 2022

20

మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. శనివారం జరిగిన టెస్ట్‌లో రవీంద్ర జడేజా ( 175 నాటౌట్‌: 17 ఫోర్లు, 3 సిక్స్‌లు)లతో దండికొడితే, రవిచంద్రన్‌ అశ్విన్‌ (61 పరుగులు, 21/2) ఆల్‌రౌండ్‌ ప్రతిభతో మాయ చేశాడు. జడ్డూ రికార్డ్‌ సెంచరీతో టీమిండియా స్కోర్ 574/8 చేరడంతో తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన లంకేయులను టీమిండియా బౌలర్లు దెబ్బతీశారు. వరుస విరామాల్లో వికెట్లు తీశారు.

దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో నిశాంక (26), అసలంక (1) ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ 2.. బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు. భారత జట్టు కంటే లంక ఇంకా 466 పరుగులు వెనకబడి ఉంది.

ఓవర్‌నైట్‌ స్కోరు 357/6తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు రవీంద్ర జడేజా, అశ్విన్ సెంచరీ భాగస్వామ్యం (130) నిర్మించారు. ఈ క్రమంలో జడేజా సెంచరీ, అశ్విన్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నారు. అయితే అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత అశ్విన్‌ మరింత దూకుడుగా ఆడే యత్నంలో అక్మల్‌ షార్ట్‌పిచ్‌ బంతికి కీపర్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత జయంత్‌ యాదవ్‌ (2) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అయితే షమీ (20 నాటౌట్‌) సహాయంతో జడేజా తన దూకుడును కొనసాగించారు. వీరిద్దరూ కలిసి వంద పరుగుల (103) భాగస్వామ్యం నిర్మించారు. ఈ క్రమంలో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రవీంద్ర జడేజా ఏడో స్థానంలో దిగి అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.