పథకాల పరంపరతో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. హస్తకళాకారులకు ఏడాదికి రూ. 10 వేల సాయం అందిస్తామని ప్రకటించారు. వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. హస్తకళాఖండాలు, చేనేత వస్త్రాలను అమ్మడానికి ఆప్కో-లేపాక్షి పేరుతో ఏర్పాటు చేసినవెబ్ సైట్ను జగన్ ఈ రోజు ప్రారంభించారు.
చేతికళాకారుల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ అవకాశం కల్పిస్తామన్న ఆయన వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రూ. 10వేల సాయం పంపిణీ చేస్తామన్నారు. ఆప్కో-లేపాక్షి సైట్లో ఉప్పాడ, ధర్మవరం, చీరాల, మంగళగిరి పట్టు, చేనేత వస్త్రాలను, కొండపల్లి బొమ్మలు, గిరిజనుల పెయింటింగ్లు, ధర్మవరం తోలు బొమ్మలు, బొబ్బిలి వీణలను కొనుక్కోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్ర వంటి ఈకామర్స్ వెబ్ సైట్లలో వీటిని అమ్మడానికి ఒప్పందాలు జరిగాయి.
కాగా 6,500 పోలీసు ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని జగన్ తెలిపారు. డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల అవుతుందని వెల్లడించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవంలో ఆయన ఈ విషయం తెలిపారు. పోలీసు శాఖకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు.