జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా.. అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు  - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా.. అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు 

June 2, 2020

Jagan delhi tour postponed in last minute

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. ఈరోజు (మంగళవారం) ఉదయం పదిన్నర గంటలకు ఆయన ఢిల్లీకి బయల్దేరాల్సి ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో అమిత్ షా కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. హోంమంత్రికి వేరే పనులు ఉన్నాయని సమాచారం అందడంతో జగన్ పర్యటన ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. 

దీనిపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడం, జగన్ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు, కృష్ణా జలాలపై తెలంగాణతో గొడవల నేపథ్యంలో పర్యటన వాయిదా పడటం గమనార్హం. జగన్ ఢిల్లీ వెళ్లక చాలా రోజులే అయింది. లాక్‌డౌన్ కారణంగా ఆయన ఢిల్లీ పెద్దలతో సమావేశం కాలేకపోయారు. విమానాల సర్వీసులు తిరిగి ప్రారంభం కావడంతో హస్తిన పర్యటన తలపెట్టారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు ఆయన అమిత్ షాతో భేటీ కావాల్సి ఉండింది. అంతకు ముందు జలవనరుల మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషితో సమావేశం కావాల్సి ఉండింది.