ఏ ప్రసవమైనా రూ. 5 వేలు.. జగన్ ప్రకటన
ఏపీలో సహజ ప్రసవాల సంఖ్యను భారీగా పెంచాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. సహజ ప్రసవమైనా, సిజేరియన్ ప్రసవమైనా తల్లులకు రూ. 5 వేలు ఇవ్వాలని ఆదిశించారు. ప్రస్తుతం సహజ ప్రసవమైతే రూ. 5 వేలు, సిజేరియన్ అయితే రూ. 3 వేలు ఇస్తున్నారు. సోమవారం జగన్ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు.
ఆరోగ్యశ్రీ, ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న నాడు-నేడు పనులు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, వంటి అంశాలపై చర్చించారు. ప్రభుత్వాస్పత్రుల్లో సహజ ప్రసవాల సంఖ్య పెంచాలని, దీనిపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని సీఎం ఆదేశించారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కిందకు మరిన్ని చికిత్సలు తీసుకురావాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కోసం ఏడాదికి రూ.4 వేల కోట్ల వరకు ఖర్చవుతోందని వెల్లడించారు. విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, కొత్త ఆస్పత్రుల నిర్మాణం, వీటిలో అభివృద్ధి పనులు షెడ్యూలు ప్రకారం పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పీహెచ్‌సీల్లో 977 సెంటర్లలో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు.