జగన్ డమ్మీ కాన్వాయ్.. ట్రయల్ రన్ కాదు - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ డమ్మీ కాన్వాయ్.. ట్రయల్ రన్ కాదు

January 19, 2020

Jagan

రేపటి నుంచి మూడు రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఓవైపు అమరావతి తరలింపును నిరసిస్తూ రైతులు, మహిళల ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు విపక్షాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే సెక్షన్‌ 144, పోలీస్‌యాక్ట్‌ 30 అమల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కీలక ప్రాంతాల్లో మూడంచెల భద్రత వ్యవస్థ, సమస్యాత్మక గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్‌ అసెంబ్లీకి చేరుకునే మార్గంలో భద్రత మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి సచివాలయం వరకు అడుగడుగునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి వెళ్లే మార్గంలో ఇప్పటికే ముఖ్యమంత్రి కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

 

డమ్మీ కాన్వాయ్

ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమ సెటైర్లు విసిరారు. ‘పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లడం సిగ్గుచేటు’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘దేశంలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లే సీఎం జగన్‌ ఒక్కడే.  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా లేని బలగాలను అమరావతి ప్రాంతంలో మోహరించారు. తప్పు చేస్తున్నారు కాబట్టే సీఎం భయపడుతున్నారు. 10 వేల మంది పోలీసులతో అసెంబ్లీ పెట్టుకునే పరిస్థితి ఎందుకొచ్చింది. అసెంబ్లీకి కొత్త రోడ్డు వేసుకుని వెళ్లే పరిస్థితిలో జగన్‌ ఉన్నారు. విశాఖలో 52 వేల ఎకరాలు చేతులు మారాయి. భూముల్ని అమ్ముకోవడానికే జగన్‌ రాజధానిని తరలిస్తున్నారు. అమరావతిని చంపేస్తే హైదరాబాద్‌‌లో రియల్‌ఎస్టేట్‌ పెరిగే విధంగా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్‌ అంతర్గత ఒప్పందం చేసుకున్నాడు. పాము తన పిల్లల్ని తానే చంపుకున్నట్లుగా జగన్ తీరు ఉంది’ అని దేవినేని ఉమ మండిపడ్డారు.