ఆంధ్రప్రదేశ్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం డబ్బు కోసమే ప్రజలను పీడిస్తోందని.. జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సోమవారం సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ఈ ప్రకటనను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆ ప్రకటనలో ”జగన్ ప్రభుత్వం ఖజానాను నింపుకోవడానికి పన్నుల పేరిట ప్రజలను పీడించడంతో పాటు, వేధిస్తున్నారు. ఇప్పటికే ఓటీఎస్ పేరుతో ప్రజల ముక్కుపిండి, మరీ వందల కోట్ల మేర నిధులను లాగేశారు. పన్నుల కోసం అధికారులు ప్రజల ఇళ్లకు వెళుతున్నారు. అక్కడ పన్నుల వసూళ్ల పేరిట ప్రజలపై సాగిస్తున్న అరాచకాలు మాటల్లో చెప్పలేనివి” అని నాదెండ్ల ప్రస్తావించారు.
అంతేకాకుండా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ పరిధిలో పన్నుల కోసం వెళ్లిన అధికారులు.. ఇంట్లో మహిళలు ఉండగానే ఆ ఇంటికి తాళం వేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య అక్రమ గృహ నిర్బంధం కిందకే వస్తుంది. ఇది ముమ్మాటికీ క్రిమినల్ చర్యేనని నాదేండ్ల పేర్కొన్నారు. అధికారులు సాగిస్తున్న ఈ తరహా దుశ్చర్యలను ప్రజలు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ తరహా చర్యలతో సీఎం జగన్ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని నాదెండ్ల ఆరోపించారు. ఈ తరహా చర్యలను తమ పార్టీ ఖండిస్తోందని నాదెండ్ల తెలిపారు.