ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చూసి నేర్చుకో జగన్ అంటూ మండిపడ్డారు. బుధవారం నారా లోకేశ్ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో రష్యా, ఉక్రెయిన్ దేశాల యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి స్వరాష్ట్రానికి చేరుకున్న విద్యార్థుల చదువులు ఆగిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
అంతేకాకుండా వారి విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించాలని కోరారు. తాము చదివే వర్సిటీ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కొంతమంది విద్యార్థులు అయోమయంలో పడ్డారని, వారి కోర్సులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని లోకేశ్ అన్నారు. ఇప్పటికే ఏపీకి పొరుగున ఉన్న తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్రెయిన్ నుంచి వచ్చిన తమ విద్యార్థుల కోర్సుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నాయని, ఆర్థికంగా అయ్యే ఖర్చు భరిస్తామని ప్రకటించాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాగే విద్యార్థులు చదువు పూర్తయ్యే బాధ్యతను తీసుకోవాలని సూచించారు.
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఉక్రెయిన్ నుంచి రాస్ట్రానికి తిరిగి వచ్చిన విద్యార్ధులు ఎంబిబిఎస్ అభ్యసించేందుకు అవసరమైన ఖర్చులను తమ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌లో వైద్య విద్యను చదివేందుకు మన దేశం నుంచి సుమారు 20 వేల మంది యువతీ యువకులు వెళ్లారని లోకేశ్ అన్నారు.కావున సీఎం కేసీఆర్‌లాగా ఏపీలో చర్యలు తీసుకోవాలని కోరారు.