Home > Featured > జగన్ జ్యోతిప్రజ్వలన చేయనన్నాడా? అమెరికాలో ఏం జరిగింది? 

జగన్ జ్యోతిప్రజ్వలన చేయనన్నాడా? అమెరికాలో ఏం జరిగింది? 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మళ్లీ ‘మత’ ఆరోపణలు వచ్చాయి. ఆయన అమెరికా పర్యటనలో జ్యోతి ప్రజ్వలన చేయడానికి నిరాకరించాడని, హిందుమతం అంటే ఆయనకు పడదని బీజేపీతోపాటు పలు హిందూ సంఘాలు మండిపతున్నాయి. గతంలో తిరుమలకు వెళ్లినప్పుడు అన్యమతస్తులు ఇచ్చే అండర్ టేకింగ్ ఇవ్వడానికి ఆయన నిరాకరించినట్లు వచ్చిన కథనాలనూ గుర్తు చేస్తున్నాయి. మరి జగన్ నిజంగానే అమెరికాలో జ్యోతి వెలిగించడానికి నిరాకరించారా?

స్టేడియం..అగ్నిమాపక నిబంధనలు

అమెరికాలో పర్యటిస్తున్న జగన్ ఈ నెల 17న డాలస్ వెళ్లినప్పుడు ‘నాటా’ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్వాహకులు జ్యోతిప్రజ్వలన చేయాలని ఆయనను కోరగా, మొదట చేతులు ముందుకు చాచారు. తర్వాత ఏదో సంభాషణ జరగడం, ఆయన చేతులు వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఆయన ఉద్దేశపూర్వకంగానే జ్యోతిని వెలిగించలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల టీడీపీని వదలి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సీఎం రమేశ్.. జగన్ జ్యోతిప్రజ్వలన వ్యవహారం వీడియోను సోషల్ మీడియోలో షేర్ చేశారు.

వివరణ..

జగన్ జ్యోతిప్రజ్వలకు నిరాకరించలేదని, స్టేడియం అమలు చేస్తున్న అగ్నిమాపక నిబంధనలను దృష్టిలో ఉంచుకునే జ్యోతి వెలిగించలేదని వైసీపీ వర్గాలు వివరణ ఇస్తున్నాయి. అమెరికాలో ఇండోర్ స్టేడియం, కన్వెన్షన్ సెంటర్ వంటి ప్రదేశాల్లోకి లైటర్, అగ్గిపెట్టె, కొవ్వుత్తులు వంటి మండే స్వభావం ఉన్న వాటిని లోనికి అనుమతించరని, డాలస్ స్టేడియం సిబ్బంది కూడా ఆ నిబంధనలు అమలు చేశారని వైకాపా, నాటా వర్గాలు చెబుతున్నాయి. జ్యోతిని వెలిగించకూడదు కనుకే తాము దీపస్తంభంలో వత్తులకు బదు ఎలక్ట్రిక్ క్యాండిల్స్ ఏర్పాటు చేశామని, జగన్ తాము చెప్పినట్లు అగ్గిపుల్ల పట్టుకుని ఎలక్ట్రికల్ క్యాండిళ్లను వెలిగిస్తున్నట్లు కెమెరాల వైపు చూశారని అంటున్నాయి. జగన్ గతంలో పాల్గొన్న సభలో జ్యోతిప్రజ్వలన చేసిన వీడియోలను వైకాపా అభిమానులు పోస్ట్ చేస్తున్నారు.

Updated : 21 Aug 2019 6:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top