ఆంధ్రప్రదేశ్‌లో ఇకనుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల విషయంలో ఉద్యోగాలే లక్ష్యంగా కోర్సులు ఉండాలని, ఇప్పుడున్న కోర్సులకు అనుబంధ, ప్రత్యేక కోర్సులు తీసుకురావాలని ఉన్నత విద్యాశాఖ అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యను అభివృద్ది బాటలో నడిపించాలని అధికారులకు ఆయన సూచనలు చేశారు. శుక్రవారం తాడేపల్లిలో విద్యాశాఖ అధికారులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చలు జరిపారు.
జగన్ మాట్లాడుతూ..”విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు ఇంగ్లీష్‌పై పట్టు, ప్రావీణ్యం వచ్చేలా గట్టి చర్యలు తీసుకోండి. జీఆర్ఈ, జీ మ్యాట్ పరీక్షల కోసం మంచి శిక్షణ ఇవ్వండి. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరగడం కోసమే విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నాం. పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. వసతి ఖర్చులూ పెట్టుకోలేక చదువులు ఆపేసే పరిస్థితులు రాష్ట్రంలో ఉండకూడదు. జీఈఆర్ పెరిగిన మాట వాస్తవమే. కానీ, మనం సంతృప్తి చెందకూడదు. జీఈఆర్ 80 శాతానికి పైగా ఉండాలి” అని అన్నారు.
మరోపక్క ఇదివరకే జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాలుగైదు యూనివర్సిటీలను ఎంపిక చేసుకుని, వాటిని దేశంలో ఉత్తమ యూనివర్సిటీల స్థాయికి తీసుకెళ్లడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. కోర్సులో భాగంగా పట్టభద్రులకు తప్పనిసరిగా మూడు విడతల్లో 10 నెలల ఇంటర్న్‌షిప్ (మొదటి ఏడాది 2 నెలలు, రెండో ఏడాది 2 నెలలు, మూడో ఏడాది 6 నెలలు) ఉండాలే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న దాదాపు 30 నైపుణ్య కాలేజీల్లో కూడా ఇంటర్న్‌షిప్ కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజీ స్థాయికి తీసుకెళ్లాలి అనే అంశాలపై ఆదేశాలు ఇచ్చారు.