Jagan sarkar removed Yogi Vemana’s Statue and Replaces with YSR statue in front of the university
mictv telugu

వేమన విగ్రహం తొలగించి వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టారు

November 10, 2022

విజయవాడలోని ఎన్టీఆర్‌ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం మరువకముందే జగన్ సర్కార్ కన్ను కడపలోని వేమన యూనివర్సిటీపై పడింది. అయితే ఇక్కడ పేరు మార్చలేదు కానీ వేమన విగ్రహాన్ని మార్చివేసి విమర్శలకు తావిచ్చారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు 2006లో వేమన పేరుతో వైయస్‌ఆర్‌ జిల్లా కడపలో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఎన్నో ఆటవెలది పద్యాలతో.. సమాజంలో నైతిక విలువలు, మూఢ నమ్మకాలు, కుల వివక్ష వంటివాటిపై జనంలో చైతన్యం తీసుకొచ్చిన ప్రజాకవి వేమన. ఆయన గొప్పతనాన్ని చాటేలా అప్పట్లో ప్రధాన పరిపాలన భవనం ముందు వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

విగ్రహం మార్పుపై విద్యార్థి సంఘాలు వీసీని ప్రశ్నిస్తే వైఎస్ రాజశేఖర్‌రెడ్డే ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారంటూ లాజిక్‌ లేని సమాధానాలు ఇవ్వడం గమనార్హం. యోగి వేమన అంటే ఒక మతానికో, ఒక కులానికో, ఓ ప్రాంతానికో చెందిన వ్యక్తి కాకుండా అందరివాడని భావించి అప్పట్లో ఈ వర్సిటీకి యోగివేమన యూనివర్సిటీగా నామకరణం చేశారు వైఎస్ఆర్. క‌డప‌లో యూనివర్శిటికి ఏర్పాటు చేసినందుకు తమ హృద‌యాల్లో వైఎస్సార్‌కు ప్ర‌త్యేక స్థానం వుందని, అలాగ‌ని యోగివేమ‌న విగ్ర‌హం తొల‌గించడాన్ని ఎలా స‌మ‌ర్థిస్తామ‌ని విద్యార్థి సంఘాల నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. సీఎం జ‌గ‌న్ మెప్పు కోసం విశ్వ‌విద్యాల‌యం ఉన్న‌తాధికారులు వేమ‌న లాంటి మ‌హా యోగిని అవ‌మానించ‌డం త‌గ‌ద‌ని విద్యార్థులు హిత‌వు చెబుతున్నారు.